Encounter: కర్రెగుట్టల్లో కాల్పుల మోత.. ఎన్‌కౌంట‌ర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-19 06:34:27  IST  )

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, అగ్రనేతల కోసం 'ఆపరేషన్ కగార్-2'లో భాగంగా కూంబింగ్ కొనసాగుతోంది.

Encounter: కర్రెగుట్టల్లో కాల్పుల మోత.. ఎన్‌కౌంట‌ర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టల్లో గురువారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ భీకర ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘నక్సల్ రహిత భారత్’ లక్ష్యంలో భాగంగా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్-2’లో భాగంగా కూబింగ్ ఆపరేషన్ చేపడుతుండగా.. ఇవాళ తెల్లవారుజామున ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. కర్రెగుట్టలు మావోయిస్టులకు కీలకమైన స్థావరం కావడంతో పక్కా సమాచారంతో సీఆర్‌పీఎఫ్ (CRPF), కోబ్రా (COBRA), గ్రేహౌండ్స్, డీఆర్జీ (DRG) దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. సుమారు 5 వేల మంది భద్రతా సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు వంటి వారు ఈ ప్రాంతంలోనే తలదాచుకున్నారన్న సమాచారంతో బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. తెల్లవారుజామున బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. అడవి లోపల ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లుగా సమాచారం. అయితే, మరణించిన ఐదుగురు మావోయిస్టుల గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఎన్‌కౌంటర్‌లో స్పాట్‌లో భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Next Story