జీపీవోల కోసం మంత్రి పొంగులేటికి ఉద్యోగ జేఏసీ చైర్మన్ కీలక రిక్వెస్ట్

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-07-05 13:44:08  IST  )

రాష్ట్రంలో కొత్తగా రానున్న జీపీవోల‌ కోసం ప్రతి రెవెన్యూ గ్రామంలో కార్యాలయ స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కోరారు.

జీపీవోల కోసం మంత్రి పొంగులేటికి ఉద్యోగ జేఏసీ చైర్మన్ కీలక రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా రానున్న జీపీవోల‌ కోసం ప్రతి రెవెన్యూ గ్రామంలో కార్యాలయ స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కోరారు. జూనియర్ అసిస్టెంట్ల నుంచి నాయబ్ తహసీల్దార్, అన్ని స్థాయిల రెవెన్యూ ఉద్యోగుల విధుల‌ను పునఃస‌మీక్షించి, జాబ్ చార్ట్ రూపొందించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప‌లు సమస్యలు – పరిష్కరించాల్సిన అంశాలపై అభ్యర్థనకు సంబంధించి శనివారం మంత్రితో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీఆర్ఎస్ఏ) గౌరవ అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు భేటీ అయ్యారు. 2015 నుంచి మాజీ వీఆర్ఏల వార‌సుల కారుణ్య నియామకాలు నిలిచిపోయాయని, అర్హత కలిగిన అభ్యర్థులకు వీలైనంత త్వరగా కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు.

రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో రెవెన్యూ అకాడమీలు ఏర్పాటు చేయాలనీ, అన్ని స్థాయిల రెవెన్యూ ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పునరుద్ధరించేందుకు క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగాల ఖాళీలకు అనుగుణంగా, అర్హత కలిగిన జూనియర్ అసిస్టెంట్‌ నుంచి నాయబ్ తహసీల్దార్ క్యాడ‌ర్ వ‌ర‌కు ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు ప‌దోన్నతులు కల్పించాలని మంత్రిని కోరారు. ప్రస్తుత జనాభా, అవ‌స‌రాలు, రెవెన్యూ శాఖకు అప్పగించిన విధుల ఆధారంగా సీసీఎల్ఏ కార్యాలయం, కలెక్టరేట్‌లు, డివిజన్ కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల స్టాఫ్ ప్యాటెర్న్‌ను పునః సమీక్షించాలని‌ లచ్చిరెడ్డి సూచించారు.

సర్టిఫికెట్ల జారీ మరియు భూ వివాదాల కారణంగా పని భారం తీవ్రంగా పెరిగిందని, ప్రతి మండలానికి మూడు స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పోస్టులు మంజూరు చేయాలని, భూ భారతి చట్టం-2025ను సమర్థవంతంగా అమలు చేయడానికి గ్రామ పాలన అధికారుల నియామక ప్రక్రియను త్వర‌గా పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ, ఇతర చట్టాల్లో వ‌స్తున్న మార్పులను ఉద్యోగులు సులభంగా అర్థం చేసుకొని, సమర్థంగా విధులు నిర్వహించేందుకు వారందరికీ ఓరియంటేషన్ శిక్షణ అందించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో తహశీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర ఉమెన్ ప్రెసిడెంట్ రాధ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రాములు, రమేష్ పాక, పూల్ సింగ్ చౌహన్, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుజాతాచౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story