జూన్ 2లోపే ఆరోగ్య కార్డులు ఇవ్వండి: సీఎస్‌ను కోరిన టీజేఏసీ

by Gantepaka Srikanth |

ఉద్యోగులంద‌రికీ జూన్ 2లోపే ఆరోగ్య కార్డుల‌ను అందించేలా చ‌ర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి, సెక్రట‌రీ జ‌న‌ర‌ల్ వొడ్నాల రాజ‌శేఖ‌ర్ కోరారు.

జూన్ 2లోపే ఆరోగ్య కార్డులు ఇవ్వండి: సీఎస్‌ను కోరిన టీజేఏసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగులంద‌రికీ జూన్ 2లోపే ఆరోగ్య కార్డుల‌ను అందించేలా చ‌ర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి, సెక్రట‌రీ జ‌న‌ర‌ల్ వొడ్నాల రాజ‌శేఖ‌ర్ కోరారు. పెండింగ్‌లో ఉన్న అన్ని ర‌కాల బిల్లుల‌తో పాటు స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించాల‌న్నారు. సీఎం ఉద్యోగుల‌కు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్నారు. అలాగే జూన్ 2కు ముందే రెండో పీఆర్‌సీని అమ‌లు చేయాల‌ని కోరారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దృష్టికి ఉద్యోగుల సమస్యలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా నగదు రహిత వైద్యం తక్షణమే అందించాలని కోరారు. రెవెన్యూ శాఖలో 61 సంవత్సరాలకు పైబడిన వీఆర్ఏల చట్టబద్ధ వారసులైన కుమారులు, కుమార్తెలను నియమించాలన్నారు.

రెవెన్యూ శాఖలో తొలగించిన 632 కంప్యూటర్ ఆపరేటర్లు, ఎఫ్‌టీఎస్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలన్నారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉపాధి హామీ కల్పించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంట‌నే విడుదల చేయాలన్నారు. రెవెన్యూ శాఖలో ధరణి ఆపరేటర్ల సేవలను కొనసాగించాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ క‌లెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యద‌ర్శులు వి.ల‌చ్చిరెడ్డి, కె.రామకృష్ణ, తెలంగాణ తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ అధ్యక్ష కార్యద‌ర్శులు ఎస్‌.రాములు, ర‌మేష్ పాక‌, టీపీయూఎస్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యద‌ర్శులు హ‌న్మంత‌రావు, డి.భాస్కర్‌, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష కార్యద‌ర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, జీపీఓ అసోసియేష‌న్ అధ్యక్షుడు గ‌రిక ఉపేంద‌ర్‌రావు పాల్గొన్నారు.

Next Story