- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 2నాటికి పీఆర్సీ అమలు చేయాల్సిందే.. ఉద్యోగుల జేఏసీ అల్టీమేటం
తెలంగాణ ఉద్యోగులందరికీ జూన్ రెండో తేదీ నాటికి పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వోడ్నాల రాజశేఖర్‌లు డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యోగులందరికీ జూన్ రెండో తేదీ నాటికి పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వోడ్నాల రాజశేఖర్‌లు డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఎంప్లాయిస్ టీచర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మండల, డివిజన్ కేంద్రాల్లో వినతి పత్రాలు సమర్పించారు. ఈ క్రమంలో జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్డీవో రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. రిటైరైన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులను వెంటనే అమలు చేయాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.
2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.






