ఎన్నికలా..? విలీనమా..? ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ!

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం, ప్రభుత్వం సర్వం సిద్ధం చేశాయి.

ఎన్నికలా..? విలీనమా..? ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం, ప్రభుత్వం సర్వం సిద్ధం చేశాయి. ఉద్యోగుల్లో నెలకొన్న ఉత్కంఠకు, అనుమానాలకు తెరదించుతూ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లోనే ఎన్నికల ఫస్ట్ నోటీసు వెలువడనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.

ఎన్నికల కసరత్తు ముమ్మరం..

ఎన్నికల నిర్వహణ అధికారిగా ప్రభుత్వం నియమించిన జాయింట్ లేబర్ కమిషనర్ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యంతో కీలక భేటీ నిర్వహించారు. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే అత్యంత కీలకమైన పోలింగ్ బూత్‌ల వివరాలు, బూత్ ఇన్‌చార్జిల జాబితాను ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే జాయింట్ లేబర్ కమిషనర్‌కు అందజేసింది. ఈ భేటీల అనంతరం యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రక్రియ ముగిసేలా అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారు.

సంఘాల వ్యూహాత్మక మౌనం!

ఒకవైపు యాజమాన్యం ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు చేస్తుంటే, మరోవైపు కార్మికుల్లో మాత్రం భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ‘మాకు ఎన్నికలు వద్దు.. ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి’ అనే డిమాండ్ కార్మికుల నుంచి, అన్ని సంఘాల నుంచి బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలని కొన్ని కార్మిక సంఘాలు ఉవ్విళ్లూరుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విషయాన్ని బాహాటంగా చెప్పలేకపోతున్నాయి. ఒకవేళ ఎన్నికలకు మొగ్గు చూపినట్లు కనిపిస్తే కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే ‘ఎన్నికలు వద్దు.. విలీనమే ముందు ముద్దు’ అంటూ కార్మిక సంఘాలు కూడా పైకి రాగం అందుకుంటున్నాయి.

ప్రభుత్వ వ్యూహం ఇదేనా?

అయితే ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన మరోలా ఉంది. గుర్తింపు సంఘం ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేసి, ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగస్వాములను చేయాలని భావిస్తోంది. చట్టబద్ధమైన గుర్తింపు ఉన్న సంఘం ఉంటేనే విలీన ప్రక్రియ సులువవుతుందని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటికే రిటర్నింగ్ అధికారిని నియమించి, రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలయ్యాక ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతల తీరు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story