జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఈవీఎం తనిఖీలపై ఎన్నికల అధికారి కీలక ప్రకటన

by Ramesh Naini |

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు), తనిఖీలపై ఎన్నికల అధికారి కీలక ప్రకటన విడుదల చేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఈవీఎం తనిఖీలపై ఎన్నికల అధికారి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు), తనిఖీ కోసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వారం రోజుల నిర్ణీత గడువులో జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారికి ఎలాంటి దరఖాస్తులు రాలేదని శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం, అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థి తర్వాత రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు కోరిన పక్షంలో, మొత్తం ఈవీఎంలలో 5 శాతం వరకు బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ వివీపాట్‌లను తయారీ సంస్థల ఇంజినీర్ల బృందం ద్వారా తనిఖీ చేసి ధృవీకరించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇందుకోసం ఫలితాల తేదీ నుంచి ఏడు రోజుల లోపు వ్రాతపూర్వకంగా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఎన్నికల నిర్వహణ మొత్తం భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, విధి నియమాలు, భద్రతా ప్రమాణాలతో పారదర్శకంగా జరిగిందని పేర్కొన్నారు.

Next Story