ఎల్ నినో పంజా.. హైదరాబాద్, ఢిల్లీ సహా పలు నగరాలకు పొంచి ఉన్న ముప్పు!

by Prasad Jukanti |

పసిఫిక్‌లో ఎల్ నినో ప్రభావంతో భారత్‌లో వర్షాలు తగ్గి, హైదరాబాద్ సహా నగరాల్లో తీవ్ర నీటి ఎద్దడి, పంట నష్టం వచ్చే ముప్పు ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఎల్ నినో పంజా.. హైదరాబాద్, ఢిల్లీ సహా పలు నగరాలకు పొంచి ఉన్న ముప్పు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నైరుతి రుతుపవనాలు కేరళం తీరాన్ని దాటడంతో వేసవి ముగిసి వర్షాకాలం మొదలైందని సంతోషిస్తున్న ప్రజలకు అంతర్జాతీయ వాతావరణ సంస్థ (WMO) చేసిన ప్రకటన షాక్‍కు గురి చేస్తోంది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నాయని హెచ్చరించింది. రాబోయే కొన్ని నెలలు గడ్డుపరిస్థితి తప్పేలా లేదని అప్రమత్తం చేసింది. ప్రకృతిలో వస్తున్న ఆకస్మిక మార్పులు పసిఫిక్ మహాసముద్రంలో సంభవిస్తున్న అసాధారణ మార్పుల వల్ల ఎల్ నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఈ కారణంగా రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో సమతుల్యత దెబ్బతినబోతోందని అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రభావంతో ఒకే సమయంలో భూమిపై కొన్ని ప్రాంతాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటే, మరికొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది.

ఏంటీ ఎల్ నినో?:

ప్రపంచ వాతావరణ గమనంలో పసిఫిక్ మహాసముద్రం పాత్ర చాలా కీలకమైంది. ప్రస్తుతం ఈ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ఉపరితల భాగాలలో నీరు అసాధారణంగా వేడెక్కుతోంది. గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే ఈ టెంపరేచర్ పెరుగుదల రికార్డు స్థాయికి చేరుకుంది. వాతావరణంలో ఈ మార్పులను శాస్త్రవేత్తలు ఎల్ నినో లేదా ఎన్సో ఉష్టదశగా పిలుస్తారు. సముద్ర ఉపరీతల వేడి పెరిగిపోవడం వల్ల వర్షాన్ని మోసుకెళ్లే గాలుల దిశ మారిపోతుంది. దీంతో కొన్ని ప్రాంతాల నుంచి మేఘాలు పూర్తిగా దూరమైపోతే, మరికొన్ని ప్రాంతాలపై కేంద్రీకృతమై భారీ వర్షాలు కురుస్తాయి. వాతావరణ సంస్థల ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జలాల ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ దాటితే అది రుతుపవనాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య ఇది ఏకంగా 1.8 డిగ్రీల సెల్సియస్‌ వరకు చేరుకునే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో రుతుపవనాలు ఆధారిత వర్షాలపై తీవ్ర ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

హైదరాబాద్ సహా ప్రముఖ నగరాలపై ఎఫెక్ట్:

ఈ ఎల్ నినో ప్రభావం భారతదేశంలోని ప్రధాన నగరాలపై తీవ్రంగా ఉండబోతోందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈ సంవత్సరం దేశంలో కేవలం 90 శాతం మాత్రమే రుతుపవన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‍తో పాటు ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి మహానగరాల్లో వర్షాలు ముఖం చాటేయనున్నాయి. దీంతో ఇక్కడ వర్షాలు లేక నీటి సమస్య ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉందని, కేవలం ఈశాన్య భారత ప్రాంతాలు మాత్రమే ఈ ముప్పు నుంచి కొంతవరకు తప్పించుకోగలవని అంచనా వేస్తున్నారు. మన దేశంలో ఖరీఫ్ సీజన్ పంటలు పూర్తిగా ఈ నైరుతి రుతుపవన వర్షాలపైనే ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఎల్ నినో కారణంగా వర్షాలు బలహీనపడితే అది పంటల సాగుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. నదీజలాలు కూడా తగ్గి నీటి అవసరాలకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది.

Next Story