- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిజిటల్ పైరసీని అరికట్టేందుకు కృషి చేయాలి : డీజీపీ శివధర్ రెడ్డి
పైరసీని అరికట్టేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

- పోలీసు శాఖ, సినీ పరిశ్రమ సమన్వయం అవసరం
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో - తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం
దిశ, తెలంగాణ బ్యూరో: డిజిటల్ పైరసీని అరికట్టేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం జరిగిన కార్యక్రమానికి డీజీపీ శివధర్ రెడ్డి హాజరయ్యారు. డిజిటల్ పైరసీని అడ్డుకునేందుకు పోలీస్ శాఖ, సినీ పరిశ్రమ సమన్వయం అవసరమని తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను పట్టిపీడిస్తున్న డిజిటల్ పైరసీని సమూలంగా నిర్మూలించేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో కృషి చేస్తుందని డీజీపీ తెలిపారు. సినిమా విడుదలైన వెంటనే వెబ్‌సైట్లు, సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లు, ఐపీటీవి స్ట్రీమ్‌లలో వచ్చే పైరసీ కంటెంట్‌ను తక్షణమే గుర్తించి అడ్డుకోవడం ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు. కమాండ్ కంట్రోల్‌లో ఫిల్మ్ ఛాంబర్ యాంటీ పైరసీ ఏజెంట్లు ఉండి, సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ ఒప్పందంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దగ్గుబాటి సురేష్ బాబు సంతకాలు చేశారు. డీజీ శిఖా గోయల్ మాట్లాడుతూ.. పైరసీ విషయంలో ప్రతి నిమిషం విలువైనదని, ఆలస్యం జరిగితే చిత్ర నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా తక్షణ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. సురేష్ బాబు మాట్లాడుతూ.. గతంలో 'తమిళ్ బ్లాస్టర్స్', 'ఐ బొమ్మ' వంటి పైరసీ ముఠాలను పట్టుకోవడంలో తెలంగాణ పోలీసులు చేసిన కృషిని కొనియాడారు. దేశంలోనే 15 ఏళ్లుగా యాంటీ పైరసీ సెల్ ఉన్న ఏకైక పరిశ్రమ టాలీవుడ్ అని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, సుప్రియ యార్లగడ్డ, రాజ్ కుమార్ ఆకెళ్ల, శ్యామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
అత్యుత్తమ సేవలందించిన 'సైబర్ వారియర్ల'కు ఘన సన్మానం
రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాల నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని (సైబర్ వారియర్స్) తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఘనంగా సన్మానించింది. 2025 సంవత్సరం 3వ, 4వ త్రైమాసికాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 22 మంది సిబ్బందిని గుర్తించి, ఈ ప్రత్యేక అవార్డులను డీజీ శిఖాగోయల్ ఆధ్వర్యంలో డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఎన్‌సీఆర్‌పీ పిటిషన్ల పరిష్కారం, బాధితులకు రిఫండ్ ఇప్పించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, సైబర్ నేరాల దర్యాప్తు, డేటా అనాలిసిస్, 1930 హెల్ప్‌లైన్ నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను అవార్డులు అందజేశారు. ఈ త్రైమాసిక సన్మాన కార్యక్రమం ద్వారా సైబర్ నేరాల పరిష్కారంలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలని బ్యూరో లక్ష్యంగా పెట్టుకుందని డీజీ శిఖాగోయల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీలు హర్షవర్ధన్, సాయిశ్రీ పాల్గొన్నారు.






