- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీఎస్టీ స్లాబుల్లో మార్పుల ఎఫెక్ట్.. రాష్ట్రానికి భారీగా తగ్గిన ఆదాయం
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబుల్లో తీసుకొచ్చిన మార్పులు తెలంగాణ రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబుల్లో తీసుకొచ్చిన మార్పులు తెలంగాణ రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. జీఎస్టీ స్లాబుల కుదింపుతో ప్రజలపై భారం తగ్గిందని కేంద్రం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, రాష్ట్రాల ఆదాయానికి మాత్రం భారీ కోత పడినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం నవంబర్ నెలలోనే తెలంగాణ రాష్ట్రానికి సేల్స్ ట్యాక్స్ ఆదాయంలో దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో జీఎస్టీ విధానంలో నాలుగు స్లాబులు అమలులో ఉండగా, తాజాగా రెండు స్లాబులను తొలగించి మూడు మాత్రమే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 5 శాతం, 18 శాతం స్లాబులు ప్రధానంగా అమలులో ఉండగా, గతంలో ఉన్న 12 శాతం, 28 శాతం స్లాబులను ఎత్తివేశారు. కొన్ని లగ్జరీ వస్తువులపై మాత్రమే 40 శాతం జీఎస్టీ కొనసాగుతోంది. ఇన్సూరెన్స్, వైద్య సేవలు సహా పలు విభాగాల్లో స్లాబ్ రేట్లను తగ్గించడంతో వినియోగదారులకు ధరల భారం కొంత మేర తగ్గింది. కోట్లాది మంది ప్రజలు ఈ మార్పుల వల్ల లబ్ధి పొందారని కేంద్రం విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
రాష్ట్రాలకు తగ్గిన ఆదాయం
అయితే ఈ స్లాబుల కుదింపుతో రాష్ట్రాలకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. తెలంగాణలో నవంబర్ నెల ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. 2023తో పోలిస్తే 2024లో రాష్ట్రానికి రూ.1490 కోట్ల మేర సేల్స్ ట్యాక్స్ ఆదాయం పెరిగింది. కానీ 2024తో పోలిస్తే 2025 నవంబర్‌లో కేవలం రూ.431 కోట్ల మేర మాత్రమే వృద్ధి నమోదైంది. దీంతో ఏడాది ప్రాతిపదికన దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆదాయం కోల్పోయినట్లైంది. జీఎస్టీ స్లాబుల సవరణ సమయంలోనే రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు చూపకుండా స్లాబులను తగ్గిస్తే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం పడుతుందని, ఆర్థికంగా రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని పలుమార్లు హెచ్చరించాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం “అమలు తరువాత పరిశీలిస్తాం” అనే సమాధానంతోనే సరిపెట్టిందని రాష్ట్ర అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదికి రూ.7వేల కోట్ల నష్టం?
తెలంగాణకు ఏడాదికి సుమారు రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశముందని ముందుగానే అంచనా వేశారు. నవంబర్ గణాంకాలను పరిశీలిస్తే ఈ అంచనాకన్నా ఎక్కువ నష్టం ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఒకే నెలలో రూ.వెయ్యి కోట్ల మేర ఆదాయం తగ్గడం భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా జీఎస్టీ స్లాబుల తగ్గింపుతో రాజకీయంగా లాభం కేం ద్రానికి దక్కినా, ఆర్థికంగా నష్టం మాత్రం రాష్ట్రాలకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం ఈ నష్టాన్ని పూడ్చేందుకు పరిహార ప్యాకేజ్ ప్రకటిస్తుందా? రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతుందా? అనే అంశంపై తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఇప్పుడు ఎదురుచూపుల్లో ఉన్నాయి.






