విద్యాసంస్థ‌ల్లో ఎన్విరాన్‌మెంట్ క్ల‌బ్‌లుండాలి : హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాథ్

by Ramesh Naini |

విద్యార్థి ద‌శ నుంచే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణపై అవ‌గాహ‌న పెంపొందించ‌డం అత్యంత అవ‌స‌ర‌మ‌ని, అప్పుడే మెరుగైన జీవితాన్ని గ‌డ‌ప‌గ‌ల‌మ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ పేర్కొన్నారు.

విద్యాసంస్థ‌ల్లో ఎన్విరాన్‌మెంట్ క్ల‌బ్‌లుండాలి : హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాథ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థి ద‌శ నుంచే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణపై అవ‌గాహ‌న పెంపొందించ‌డం అత్యంత అవ‌స‌ర‌మ‌ని, అప్పుడే మెరుగైన జీవితాన్ని గ‌డ‌ప‌గ‌ల‌మ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన వాతావరణాన్ని అందించాలంటే విద్యార్థుల్లోనే బాధ్యత భావాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రతి విద్యాసంస్థలో ఎన్విరాన్‌మెంట్ క్లబ్‌ల ఏర్పాటు కీలకమని సూచించారు. హైటెక్స్‌లో సీబీఐటీ కళాశాల శుక్ర‌వారం నిర్వహించిన ‘మోడల్ యునైటెడ్ నేషన్స్ 2026’ కార్యక్రమంలో శాస‌న‌స‌భాప‌తి గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ గారితో క‌లిసి హైడ్రా క‌మిష‌న‌ర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న కల్చరల్ క్లబ్‌లు, యాంటీ ర్యాగింగ్ క్లబ్‌లు, ప్లేస్‌మెంట్ క్లబ్‌లు, స్పోర్ట్స్ క్లబ్‌లు, అంత‌ర్జాతీయ ప‌రిణామాల అవ‌గాహ‌న క్ల‌బ్‌ల మాదిరిగానే పర్యావరణ క్లబ్‌లను కూడా ఏర్పాటు చేస్తే విద్యార్థులు ప్రకృతి పరిరక్షణలో చురుకుగా పాల్గొనే అవకాశాలుంటాయ‌ని చెప్పారు.

ఈ క్లబ్‌ల ద్వారా చెట్లు నాటడం, జ‌ల‌వ‌న‌రులు ప‌రిర‌క్ష‌ణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిశుభ్రత కార్యక్రమాలు వంటి అంశాలపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావచ్చన్నారు. ప్రతి విద్యార్థి తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తే సమాజంలో సానుకూల మార్పు తప్పకుండా కనిపిస్తుందని అన్నారు. హైడ్రా సంస్థ చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ, ప్ర‌కృతి వనరుల పరిరక్షణలో విద్యార్థులు భాగ‌స్వామ్యం కావాల‌ని సూచించారు. విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు విద్యాసంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఒక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు

పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. విద్యార్థుల నుంచే ఈ మార్పు ప్రారంభమైతే, భవిష్యత్తులో పచ్చదనం నిండిన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గొలుసుక‌ట్టు చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌తో పాటు వ‌ర‌ద కాలువ‌ల ప‌రిర‌క్ష‌ణను హైడ్రా పెద్ద‌యెత్తున చేప‌ట్టింద‌న్నారు. ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు, పార్కులు, నాలాలు, చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌ను పెద్ద‌యెత్తున తొల‌గిస్తున్నామ‌ని చెప్పారు. ఇలా రూ. 70 వేల కోట్ల ప్ర‌జా ఆస్తిని హైడ్రా కాపాడింద‌న్నారు. చెరువుల‌తో వ‌ర‌ద‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చున‌ని.. ఆ దిశ‌గా ప్రాధాన్య క్ర‌మంలో న‌గ‌రంలో చెరువుల‌ను పున‌రుద్ధ‌రిస్తోంద‌ని అన్నారు. చైత‌న్య‌భార‌తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ప్రిన్సిపాల్ ప్రొ. సీవీ న‌ర‌సింహులు క‌ళాశాల నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. క‌ళాశాల విద్యార్థ‌లు, ఫ్యాక‌ల్టీ స‌భ్యులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Next Story