విద్యాసంస్థలంటే నిర్మాణాలు కాదు

by Elthuri vijay kumar |

విద్యాసంస్థలంటే కేవలం ఇటుకలు, నిర్మాణాలు కాదని, దార్శనికత–విలువలతో, శ్రేష్ఠత కోసం నిరంతర కృషితో రూపుదిద్దుకున్న జీవన వ్యవస్థలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.

విద్యాసంస్థలంటే నిర్మాణాలు కాదు
X

విద్యాసంస్థలంటే నిర్మాణాలు కాదు

– గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

- మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఘనంగా నాలుగో స్నాతకోత్సవానికి

దిశ, నల్లగొండ బ్యూరో: విద్యాసంస్థలంటే కేవలం ఇటుకలు, నిర్మాణాలు కాదని, దార్శనికత–విలువలతో, శ్రేష్ఠత కోసం నిరంతర కృషితో రూపుదిద్దుకున్న జీవన వ్యవస్థలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో జరిగిన నాలుగో స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. ముందుగా ఆర్ట్స్ కాలేజ్ వద్ద గవర్నర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించగా, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. తరువాత ఇండోర్ స్టేడియంలో మొక్కలు నాటి, 22 మందికి పీహెచ్‌డీ డిగ్రీలు, 57 మందికి స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం గ్రామీణ విద్యార్థులకు పోషణ వేదికగా నిలుస్తోందని, చాలామంది మొదటి తరం అభ్యాసకులుగా అడ్డంకులను అధిగమించి బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతున్నారని చెప్పారు. విద్యార్థుల హాజరు బలోపేతం, హాస్టల్–క్యాంపస్ సదుపాయాల మెరుగుదల, సమ్మిళిత వాతావరణం పెంపుపై యూనివర్సిటీ చూపుతున్న దృష్టి ప్రశంసనీయం అని అన్నారు. న్యాక్ గుర్తింపు విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను పెంచుతోందని, జాతీయ స్థాయి విద్యాసంస్థగా ఎదగాలంటే పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ను బలపరచాలని సూచించారు. పరిశోధన, ఆవిష్కరణలు, సేవా కార్యక్రమాలే భవిష్యత్తు బాటలు అని, కోవిడ్ సమయంలో భారత్ చూపిన ప్రతిభ ఇందుకు నిదర్శనం అన్నారు. భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, త్వరలో మూడో స్థానంలో నిలుస్తుందని, ఈ వృద్ధిలో విశ్వవిద్యాలయాల పాత్ర కీలకమని గవర్నర్ పేర్కొన్నారు. “భారత గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంక్ 2015లో 81 నుంచి 39వ స్థానానికి చేరడం సంతోషకరమని, కొత్త సాంకేతికతలకు, ముఖ్యంగా కృత్రిమ మేధస్సుకు విద్యార్థులు సిద్ధం కావాలి” అని ఆయన సూచించారు. డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం చెప్పిన “కలలు కనండి, ఆలోచనలుగా మారుస్తూ కార్యరూపంలోకి తీసుకువెళ్లండి” అనే స్ఫూర్తిదాయక సందేశాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు. హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ బి.ఎస్. మూర్తి మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని, ప్రతి డిగ్రీతో పాటు ఒక ఇష్టమైన విభాగంలో మరొక డిగ్రీ సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. “ప్రజల కోసం పని చేయండి, మీకోసం కాదు” అని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story