భవిష్యత్తు ప్రగతికి విద్య ఒక్కటే మార్గం.. బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి పొన్నం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-28 06:43:46  IST  )

బీసీ సంక్షేమ శాఖలో భవిష్యత్తు ప్రగతికి విద్య ఒక్కటే మార్గమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

భవిష్యత్తు ప్రగతికి విద్య ఒక్కటే మార్గం.. బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి పొన్నం
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ సంక్షేమ శాఖలో భవిష్యత్తు ప్రగతికి విద్య ఒక్కటే మార్గమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 (Telangana Rising at the Global Summit-2047)లో భాగంగా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీలు వ్యవసాయం, చేతి వృత్తులు, నైపుణ్యాలు, సాంప్రదాయ వృత్తులకు వెన్నెముకగా నిలుస్తున్నారని తెలిపారు. వారి సామాజిక ఆర్థిక పురోగతి రాష్ట్ర వృద్ధికి కీలకమైందని అన్నారు.

తెలంగాణ రైజింగ్-2047లో బీసీలు విద్యాపరంగా బలంగా, ఆర్థికంగా స్వతంత్రంగా, సామాజికంగా సాధికారత సాధించి, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి రాష్ట్ర వృద్ధికి చోదకంగా ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వాన్ని ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్య, మానవ మూలధనం నిరంతరాయంగా నాణ్యమైన అభ్యాసంతో విద్యా ప్రమాణాలను బలోపేతం చేయడం, మెరుగుపరచడం, రెసిడెన్షియల్ సంస్థలు, హాస్టళ్లను అత్యుత్తమ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్నారు. ఉన్నత పాఠశాల నుంచే ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, వ్యవస్థాపకతను పరిచయం చేయాలన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో చర్చించి రైజింగ్ తెలంగాణ విజన్-2047లో పలు కీలక అంశాలు చేర్చనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా శ్రీధర్, గురుకుల సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ అలోక్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story