TG: స్టూడెండ్స్ సర్కార్ గుడ్ న్యూస్.. మరింత టేస్టీగా మధ్యాహ్నం భోజనం

by Gantepaka Srikanth |

విద్యార్థులకు మరింత నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నది.

TG: స్టూడెండ్స్ సర్కార్ గుడ్ న్యూస్.. మరింత టేస్టీగా మధ్యాహ్నం భోజనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులకు మరింత నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందులో భాగంగానే పాఠశాల టీచర్లు, విద్యార్థులతో కలిసి భోజనం చేసేలా చర్యలు తీసుకోనుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనల మేరకు విద్యాశాఖ ఈ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే స్కూళ్లలో ఒక టీచర్ మధ్యాహ్నం భోజనం ఎలా ఉందో చెక్ చేయడానికి తినాలనే నిబంధన ఉంది. అయితే ఆ నిర్ణయాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని పలువురు విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నారు. తద్వారా ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ కేసులు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

నాణ్యతపై ఎలా?

విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఇటీవల హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుల్లో ఒకరు ఎందుకు మధ్యాహ్నం భోజనం తినకూడదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉపాధ్యాయులు అలా చేస్తే విద్యార్థులకు సరైన, నాణ్యమైన భోజనం అందే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో భోజనం నాణ్యతను మెరుగుపరచడం, అది సరిగ్గా వండి, పరిశుభ్రంగా అందిస్తున్నారో లేదో? పర్యవేక్షించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తే నాణ్యత మెరుగుపడటమే కాకుండా విద్యార్థులకు మరింత భరోసా కలుగుతుందని భావిస్తున్నారు.

వంట కార్మికులపై పనిభారం

ఈ కొత్త ప్రణాళికను అమలు చేయడానికి వంట కార్మికులపై పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఒక విద్యార్థి పై రూ.8.65 అందిస్తున్నారు. వారంలో మూడు రోజులు గుడ్డు, మూడు రోజులు రాగిజావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వంట కార్మికులకు అదనపు పనికి వారికి అదనపు వేతనాలు చెల్లిస్తారా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ అంశంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ చర్యల ద్వారా మధ్యాహ్న భోజన పథకం మరింత సమర్థవంతంగా అమలవుతుందని విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అక్షయ పాత్ర ఫౌండేషన్ సక్సెస్

మధ్యాహ్న భోజన పథకాన్ని వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్నారు. అమలవుతున్న స్కూళ్లలో టీచర్లు మధ్యాహ్న భోజన విషయంలో సుముఖత వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అందుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాగే మరికొన్ని జిల్లాల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఆహారం అందించాలని పలువురు టీచర్లు అభిప్రాయపడుతున్నారు. కొన్నేళ్లుగా స్కూళ్లలో పనిచేస్తున్న వంట కార్మికులు మాత్రం అక్షయ పాత్ర ఫౌండేషన్ కు మధ్యాహ్న భోజనం బాధ్యతలను అప్పగించడంపై వ్యతిరేకిస్తున్నారు.

Next Story