- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ఇంటర్ విద్యపై విద్యా కమిషన్ పబ్లిక్ హియరింగ్
రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు ఇంటర్మీడియట్ మార్కులను పరిగణలోకి తీసుకుని, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ లాంటి కోర్సుల్లో అడ్మిషన్లు చేపడితే ఎలా ఉంటుందనే అంశంపై తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పలువురు విద్యావేత్తల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు ఇంటర్మీడియట్ మార్కులను పరిగణలోకి తీసుకుని, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ లాంటి కోర్సుల్లో అడ్మిషన్లు చేపడితే ఎలా ఉంటుందనే అంశంపై తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పలువురు విద్యావేత్తల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ విద్యా కమిషన్ బుధవారం హైదరాబాద్‌లోని ఎస్ సీఈఆర్టీ కార్యాలయంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిధుల కొరత, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో దోపిడీ, విద్యార్థుల ఆత్మహత్యల పెరుగుదల వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. సివిల్ సొసైటీ సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తమ సూచనలు, అభిప్రాయాలను కమిషన్ ముందు వెలిబుచ్చారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలకు తగిన నిధులు లేకపోవడంతో మౌలిక సదుపాయాలు, బోధనా వసతులు సరిగా లేవని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాల ప్రకారం గరిష్టంగా రూ. 5,000 ఫీజు వసూలు చేయాల్సి ఉండగా, కార్పొరేట్ కళాశాలలు "సెమీ-రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్" పేరుతో ఏటా రూ. 2.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. చాలా ప్రైవేట్ కళాశాలలకు సరైన అనుమతులు లేవని, అయినప్పటికీ అవి నడుస్తున్నాయని, దీనిపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రయివేటు కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, దీనికి కారణాలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. ప్రభుత్వ కళాశాలల ఆదరణ కోల్పోవడానికి ప్రధానంగా నిధుల లేమి, సౌకర్యాల కొరత కారణంగా విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుండి ప్రైవేట్ వైపు మళ్లుతున్నారని నిపుణులు పేర్కొన్నారు.
కమిషన్ కు సూచనలు
రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 15 శాతం నిధులను విద్యకు కేటాయించాలని, అందులో కొంత భాగాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి వినియోగించాలని కార్యకర్తలు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ఫీజులను నియంత్రించడానికి కఠినమైన విధానాలను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బందిని సమకూర్చాలన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, ఈ పబ్లిక్ హియరింగ్‌లో వచ్చిన సూచనలు, సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.






