27 ఏళ్ల తర్వాత ECI రౌండ్ టేబుల్ సమావేశం

by Gantepaka Srikanth |

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం జరిగిన ఈసీఐ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) రాణి కుముదిని పాల్గొన్నారు.

27 ఏళ్ల తర్వాత ECI రౌండ్ టేబుల్ సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం జరిగిన ఈసీఐ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) రాణి కుముదిని పాల్గొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి అధ్యక్షత వహించారు. 27 సంవత్సరాల విరామం తర్వాత ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. చివరి రౌండ్ టేబుల్ సమావేశం 1999 సంవత్సరంలో జరిగింది. ఈ సమావేశంలో ఈసీఐ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల మధ్య రాజ్యాంగ పరిమితుల్లో సమన్వయం బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఎన్నికల జాబితాల నిర్వహణలో సమన్వయం, సాంకేతికత వినియోగం, ఉత్తమ పద్ధతుల పంచుకోవడం ద్వారా ఎన్నికల పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని తెలిపారు.

ఎన్నికల కమిషనర్ డా.సాంధూ మాట్లాడుతూ.. రాష్ట్ర కమిషనర్లు పరస్పరం ఉత్తమ పద్ధతులను నేర్చుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో విశ్వాసం ముఖ్యమని, అందుకోసం ఈసీఐ, ఎస్ఈసీలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల చట్టాలను పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికల చట్టాలతో సమన్వయం చేయాల్సిన అవసరముందన్నారు. అంతర్జాతీయ సమావేశాలలో రాష్ట్ర కమిషనర్లు పాల్గొనాలని సూచించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలని ప్రతిపాదించారు. ఈ సమావేశంలో వచ్చిన సూచనలను చట్టపరమైన, సాంకేతిక బృందాలు పరిశీలించి, మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు.

Next Story