Eatala vs Bandi: బండి సంజయ్ వ్యాఖ్యలపై ఈటల ఇంట్లో అనుచరుల కీలక సమావేశం

by Prasad Jukanti |   (  Updated:2025-07-19 06:54:19  IST  )

తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అంశం చర్చ గా మారింది.

Eatala vs Bandi: బండి సంజయ్ వ్యాఖ్యలపై ఈటల ఇంట్లో అనుచరుల కీలక సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో తాజా పరిణామాలు ఆసక్తిగా మారాయి. హుజూరాబాద్ బీజేపీ పాలిటిక్స్ హైదరాబాద్ శామీర్ పేటకు చేరాయి. ఈటల రాజేందర్ (Eatala Rajender) వెంట 20 ఏళ్లుగా నడుస్తున్న తమకు బీజేపీలో పార్టీ పదవులు, బాధ్యతలు దక్కడం లేదని ఈటల అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు హుజూరాబాద్ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇవాళ ఉదయమే పెద్ద సంఖ్యలో శామీర్ పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి చేరుకున్నారు. పార్టీలో ప్రయార్టీ లేదని, బండి సంజయ్ (Bandi Sanjay) వర్గం తమను పట్టించుకోవడం లేదని ఈటల వర్గానికి చెందిన హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జి గౌతం రెడ్డి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తమ ను పట్టించుకోవడం లేదని ఈటల వర్గం ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం తెలంగాణ బీజేపీలో సంచలనంగా మారాయి.

మా నోట్లో అన్నం పెడతావో మట్టికొడతావో నీ ఇష్టం:
తన నివాసానికి వచ్చిన అనుచరులతో ఈటల ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు మాట్లాడుతూ.. మమ్మల్నీ నియోజకవర్గంలో పాత బీజేపీ, కొత్త బీజేపీ అని మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ టికెట్లు పాతవారికే ఇస్తారని అంటున్నారని, ఈటల రాజేందర్ టికెట్లు ఇవ్వరని చెబుతున్నారని మరి మా బతుకులు ఏం కావాలని అడిగారు. మా సంగతి ఏంటో తెల్చే వరకు మేము భోజనం చేయము. మేము ఇక్కడి నుంచి కదలమన్నారు. 20 ఏళ్లుగా మీ వెంట నడిచినందుకు మా నోట్లో అన్నం పెడతారో లేక మట్టి కొడతారో మీ రే చెప్పాలన్న అంటూ ఈటల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

బండి హాట్ కామెంట్స్:

మొన్న హుజూరాబాద్ లో పర్యటించిన బండి సంజయ్ ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో తనకు తక్కువ ఓట్లు రావాలని హుజూరాబాద్ లో కొంత మంది పని చేశారని అలాంటి వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమంటారా అని బండి ప్రశ్నించారు. బీజేపీలో వర్గాలు ఉండవు.. ఉండకూడదు. అలాంటి వారికి పార్టీలో స్థానం లేదన్నారు. ఎవరైనా వర్గాలు మెయింటైన్ చేయాలని అనుకుంటే అది వారి మూర్ఖత్వమే అవుతుందని వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలో ప్రోత్సహించమని హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లనే ఆదరిస్తాం, ఆదుకుంటాం.. నిధులు ఇస్తామని అలా కాదని కొందరు గిరి గీసుకొని మరీ వర్గాలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక నుంచి అలాంటివి సహించమని హెచ్చరించారు. అయితే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసిన ఆ వెంటనే ఈటల వర్గీయుడు గౌతం రెడ్డి పార్టీకీ రాజీనామా చేశారు.

వాట్ నెక్స్ట్:

ఈటల విషయంలో గత కొంత కాలంగా పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకు దక్కబోతుందన్న టాక్ బలంగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో కానీ అధిష్టానం రామచందర్ రావు పేరును ఖరారు చేసింది. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తం అయింది. ఈ నిర్ణయం పట్ల అసంతృప్తితో ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ రాజీనామా చేశారు. రాష్ట్రం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ పదవి ఈటలకు దక్కి ఉంటే పార్టీలో కొత్త ఉత్తేజం వచ్చేదని సొంత పార్టీ మద్దతుదారులే సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో హుజూరాబాద్ చోటు చేసుకుంటున్న పరిణామాలకు బండి వర్సెస్ ఈటల మధ్య వర్గపోరు అనే చర్చ బయటకు వస్తోంది. అసలే త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ చిచ్చు రాజుకోవడం ఈ క్రమంలో తన అనుచరులకు ఈటల ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.

Next Story