Eatala Rajendar: ప్రగల్భాలు పలికి మట్టికరిచారు.. గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల ఫైర్

by Prasad Jukanti |

ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ను మట్టికరిపించారని ఈటల హాట్ కామెంట్స్ చేశారు.

Eatala Rajendar:  ప్రగల్భాలు పలికి మట్టికరిచారు.. గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ గురించి తెలుసుకోవడానికి 9 ఏళ్లు పడితే, రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిజస్వరూపం ఒక్క ఏడాదిలోనే బయటపడిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్, బీఆరెస్ ను నమ్మడం లేదని ఒక్క బీజేపీని మాత్రమే నమ్ముతున్నారన్నారు. ఆదివారం గజ్వేల్ (Gajwel) లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో (MLC election campaign) పాల్గొన్న ఈటల.. ఈ గడ్డ మీద మాకు తిరుగులేదని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ను ఆయన పార్టీని గత లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు మట్టికరిపించాలని సెటైర్ వేశారు. పార్టీలు నాయకుల జాగీరు కాదు ప్రజల జాగీరు అని తేల్చి చెప్పారన్నారు. నాతోపాటు అనేకమంది బీసీ నేతలను బయటికి పంపిన పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ పాలనలో మంత్రులంతా ఉత్సవ విగ్రహాలు. ప్రజాస్వామ్య బద్ధంగా ఉండి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అవకాశం ఇచ్చి ఉంటే ఆ పార్టీకి ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఆ పార్టీకి బీసీ అనే మాట ఎత్తే అర్హత ఆ పార్టీకి కేసీఆర్ (KCR) కుటుంబానికి లేదని మండిపడ్డారు. మంత్రులు ఇతర క్యాబినెట్ హోదా కలిపి 21 మందిలో 4 బీసీలకు మంత్రిపదవులు ఇచ్చారు. నన్ను వెళ్లగొట్టాక మిగిలింది ముగ్గురే. వారు అధికారంలో ఉన్నప్పుడు ఈ వర్గాల గురించి ఆలోచనే చేయలేదని విమర్శించారు. అణగారిన వర్గాల కోసం ఆలోచన చేసే ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. 317 జీఓతో టీచర్లను బీఆర్ఎస్ పార్టీ హింసిస్తే వారికి బీజేపీ అండగా నిలబడిందని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ లో మధ్యతరగతి, వేతన జీవులకు దేశవ్యాప్తంగా రూ.12 లక్షల వరకు ఇన్ కమ్ టాక్స్ బెనిఫిట్స్ ఇచ్చామని గుర్తు చేశారు. టీచర్లు, పట్టభద్రుల ఎన్నికల్లో అందరూ మోడీ వైపు ఉన్నారని చెప్పారు.

ఇక్కడా బీజేపీనే కోరుకుంటున్నారు:

నేను గజ్వేల్ లో పోటీ చేస్తే గొప్పగా ఆదరించారు. వెల్లువలా వచ్చి ఆశీర్వదించారని పార్టీ ఆదేశాలమేరకు ప్రచారం చేయడానికి మీ ముందుకు వచ్చానని చెప్పారు. కేంద్ర నిధులు ఇస్తేనే గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని కనీసం జీతాలు ఇవ్వగలుగుతున్నారన్నారు. నిరుద్యోగ సమస్య మీద మనదగ్గరే కాదు అమెరికా యూరప్ గల్ఫ్ దేశాల్లో కూడా చర్చ జరుగుతుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి మోడీకి అధికారం కట్టబెట్టారు. కానీ పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీలు అవలంభిస్తున్న తీరు చూసి దేశ ప్రజలు అసహించుకుంటున్నారు. బీజేపీ (BJP) కి ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందని అనుకుంటున్నారన్నారు. దాని ఫలితమే హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అన్నారు. అయోధ్యలో ఓడిపోయారు అని మాట్లాడితే అక్కడ కూడా మొన్న బై ఎలక్షన్స్ లో బీజేపీనే గెలిచిందని గుర్తు చేశారు. టీచర్ల, రైతాంగం, మహిళల సమస్య తీరాలంటే తెలంగాణలో కూడా బీజేపీ రావాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. వాజ్ పెయి ఉన్నప్పుడు మైనారిటీ బిడ్డ రాష్ట్రపతి అయితే.. మోడీ వచ్చాక ఒక దళిత బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ దేశ మొదటి పౌరులయ్యారని గుర్తు చేశారు. ఈ వర్గాలకు ఉన్నత పదవులు ఇవ్వాలని ఏనాడన్నా కనీసం ఆలోచనైనా చేశారా? అని ప్రశ్నించారు.

Next Story