తెలంగాణలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లడం ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

తెలంగాణలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మంగళవారం భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), ఇతర మంత్రులు పాల్గొన్నారు. అనంతరం ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లడం ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టిన ఈ యూనివర్సిటీని ఆయన ప్రతిష్టకు తగిన విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో నిర్మించనున్న ఈ యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా పూర్తిస్థాయి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ లేకపోవడం వల్ల, ఈ సంస్థ భూగర్భ పొరలు, ఖనిజాలు, భూమికి సంబంధించిన శాస్త్ర పరికల్పనలపై సమగ్ర పరిశోధనలకు కొత్త దిశ చూపనుందని చెప్పారు. అతి తక్కువ సమయంలో భవనాలు, ఆధునిక సౌకర్యాలు, పరిశోధన వసతులు పూర్తి చేసి యూనివర్సిటీని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యూనివర్సిటీ దేశానికి విజ్ఞాన దిక్సూచిగా, తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే కేంద్రంగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Next Story