గోల్కొండ తారామతి రిసార్ట్‌లో 'ఈగల్' రైడ్.. బాలీవుడ్ నటులకు డ్రగ్స్ టెస్టులు!

by Gantepaka Srikanth |

రాజధానిలో డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఈగల్(EAGLE) అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

గోల్కొండ తారామతి రిసార్ట్‌లో ఈగల్ రైడ్.. బాలీవుడ్ నటులకు డ్రగ్స్ టెస్టులు!
X

దిశ, వెబ్‌డెస్క్: రాజధానిలో డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఈగల్(EAGLE) అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా శనివారం అర్ధరాత్రి గోల్కొండ పరిధిలోని చారిత్రాత్మక తారామతి రిసార్ట్‌లో ఈగల్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. రిసార్ట్‌లో నిర్వహిస్తున్న 'జాక్, జాన్సన్' (Jack & Johnson) అనే హై-ప్రొఫైల్ ఈవెంట్‌పై ఈగల్ అధికారులకు ముందస్తు సమాచారం అందింది. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. వీకెండ్ (శనివారం) కావడంతో యువత భారీగా తరలిరావడమే కాకుండా, ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనిఖీల సమయంలో రిసార్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు, అనుమానితులకు తక్షణమే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈవెంట్‌లో పాల్గొన్న సెలబ్రిటీలతో సహా అనుమానితులందరికీ అధికారులు అక్కడికక్కడే డ్రగ్ టెస్టులు చేశారు.

టాస్క్ ఫోర్స్ సహకారం..

హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి ఈగల్ బృందం ఈ ఆపరేషన్‌ను అత్యంత గోప్యంగా నిర్వహించింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ కోసం 'ఈగల్' ఫోర్స్‌ను మరింత బలోపేతం చేసిన సంగతి తెలిసిందే. రిసార్టులు, పబ్‌లు, ఫామ్‌హౌస్‌లలో జరిగే రేవ్ పార్టీలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్, ఏఐ (AI) పరికరాలను కూడా వాడుతున్నారు. తారామతి రిసార్ట్ ఘటనలో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు అనే వివరాలను అధికారులు త్వరలోనే వెల్లడించనున్నారు.

Next Story