- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదాద్రి తరహాలో మరో టెంపుల్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ పర్యాటక రంగంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. వికారాబాద్‌ను టూరిజం హబ్‌గా, దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా మార్చాలని ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ లోని బోధి పెవిలియన్‌లో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తారామతి బారామతిని టూరిజం ప్లేస్‍గా మరింత గా అభివృద్ధి చేయాలని, దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. మంజీరా, దిల్‍కుషా గెస్ట్ హౌస్‍లను ఆధునీకరించాలన్నారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్‍ను అభివృద్ధి చేయాలన్నారు. వికారాబాద్‍లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయయడంతో ఈ ఆలయానికి యాదగిరిగుట్ట తరహాలో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఎకో పార్కులు.. ఫ్యూచర్ సిటీలో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్:
పర్యాటక రంగాన్ని ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లేందుకు వీలుగా క్యూర్ (QUR) పరిధిలోని అటవీ భూములను, పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుంటూ 'ఎకో టూరిజం'గా మార్చాలని సీఎం ఆదేశించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలోనే నగరంలో మరిన్ని ఎకో పార్కులను అందుబాటులోకి తేవాలన్నారు. ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని చెప్పారు. ఈ అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పురానాపూల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ మళ్లింపు?
పాతబస్తీలోని చారిత్రక పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. బ్రిడ్జిపై పర్యాటకుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, అవసరమైతే అక్కడ ట్రాఫిక్‌ను మళ్లించి పూర్తి స్థాయిలో పర్యాటక జోన్‌గా మార్చే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించ తలపెట్టిన 'గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్' పై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మెగా సమ్మిట్ విజయవంతం కావడానికి వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని, ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, టూరిజం సెక్రటరీ వాణి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు.






