- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ramesh Reddy: కాళోజీ హెల్త్ వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా డా.రమేష్ రెడ్డి
అవినీతి ఆరోపణల వేళ కాళేజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (Kaloji Narayana Rao Health University) ఇన్‍చార్జి వీసీగా (Vice Chancellor) డా.రమేశ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. రమేశ్ రెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్‍గా పని చేస్తున్నారు. గతంలో ఈయన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) గా పని చేశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ పోస్టులో ఇదివరకు డాక్టర్ నందకుమార్‌రెడ్డి పని చేశారు. అయితే నందకూమార్ రెడ్డి వీసీగా చేరినప్పటి నుంచి హెల్త్ వర్సిటీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా పీజీ పరీక్షల్లో ఫెయిల్ అయిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందిన కొందరు విద్యార్థులను పాస్ అయ్యేలా ఆయన చేశారని అలాగే ఇన్ చార్జీల నియామకంలో ఇష్టారీతిగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతోందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించగా విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న క్రమంలో నందకుమార్‌రెడ్డి గత నెల 28వ తేదీన వీసీ పదవికి రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసి మరుసటి రోజే తిరిగి విధుల్లో చేరి, కొత్త వీసీ వచ్చే వరకు తననే ఆపద్ధర్మ వీసీగా కొనసాగమన్నారని ఆయనే మీడియాకు చెప్పారు. తాను ఏ తప్పుచేయలేదని, ఎటువంటి విచారణకైనా సిద్ధమేనని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు డీఎమ్ఈ గా పనిచేసిన అనుభవంతో పాటు వైద్య విద్యలో విశేష అనుభవం ఉన్న డా. రమేష్ రెడ్డిని (Dr. Ramesh Reddy) వీసీగా నియమించడంతో అస్తవ్యస్తంగా మారిన కాళోజి వర్సిటీని గాడిన పెట్టి వైద్య విద్యను పట్టాల పైకి ఎక్కిస్తారని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.






