డైరెక్టరేట్ ఆఫ్ నర్సింగ్ ఏర్పాటుపై నీలినీడలు

by Ajay Maddhiboyina |

రాష్ట్ర నర్సింగ్‌ విభాగం దశాబ్దాల కల అయిన డైరెక్టరేట్‌ ఆఫ్ నర్సింగ్ ఏర్పాటు విషయమై ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 6న కేబినెట్ ఆమో దం తెలిపింది. అయితే డైరెక్టరేట్ ఏర్పాటుకు సంబంధించి నేటి వరకు ఒక్క అప్‌ డేట్ కూడా లేకపోవడంతో నర్సుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది.

డైరెక్టరేట్ ఆఫ్ నర్సింగ్ ఏర్పాటుపై నీలినీడలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర నర్సింగ్‌ విభాగం దశాబ్దాల కల అయిన డైరెక్టరేట్‌ ఆఫ్ నర్సింగ్ ఏర్పాటు విషయమై ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 6న కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే డైరెక్టరేట్ ఏర్పాటుకు సంబంధించి నేటి వరకు ఒక్క అప్‌ డేట్ కూడా లేకపోవడంతో నర్సుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. కేబినెట్ ఆమోదం తెలిపి 5 నెలలు గడిచినా డైరెక్టరేట్ ఏర్పాటుపై ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో ఉన్న నర్సులు కేబినెట్ నిర్ణయంతో తమ దశాబ్దాల కల నెరవేరుతుందని ఆశించినా... వైద్య, ఆరోగ్య శాఖలో కీలకంగా ఉన్న ఓ అధికారి తీరువల్లే డైరెక్టరేట్ ఏర్పాటు అటకెక్కిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గం నిర్ణయాలను అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది.

ఆ అధికారి తీరుతోనే ఆగిన డైరెక్టరేట్..

రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్‌ నర్సులు, ఏఎన్ఎం, నర్సింగ్ ఫ్యాకల్టీ మొదలైన నర్సింగ్ విభాగం ఉద్యోగుల దశాబ్దాల కలను సాకారం చేస్తూ ఈ ఏడాది జూన్ 6న రాష్ట్ర కేబినెట్ డైరెక్టరేట్ ఆఫ్ నర్సింగ్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనే దీన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్ష్మారెడ్డి వైద్య మంత్రిగా ఉన్నప్పుడు కూడా డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అయినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకుని డైరెక్టరేట్ ఆఫ్ నర్సింగ్ ఏర్పాటుకు సర్కారును ఒప్పించి కేబినెట్ అప్రూవల్ కూడా ఇప్పించారు. ఇది జరిగి 5 నెలలు గడుస్తున్నా కూడా వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఓ కీలక అధికారి కనీసం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని నర్సింగ్ సంఘాలు వాపోతున్నాయి.

కనీస కార్యాచరణే లేదు..

నర్సింగ్‌ డైరెక్టరేట్‌ నిర్మాణం, విభాగాధిపతి, డైరెక్టరేట్‌ ఎలా పనిచేయాలన్న అంశంపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేబినెట్ అనుమతి తర్వాత ప్రకటించినా... దా నిపై నేటికీ ఎలాంటి స్పష్టత లేకుండా పో యింది. అయితే ఈ అంశంపై సెక్రెటేరియట్, డీఎంఈ, డీహెచ్, కమిషనర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లే దని... దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని నర్సింగ్ యూనియన్ కు చెందిన ఓ నాయకుడు తెలిపారు. అయితే ఫైల్ ఆగిపోయేందుకు కారణమైన అధికారిపై చర్య తీసు కుని వెంటనే నర్సింగ్ డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయకపోవడం అంటే ప్రభుత్వ ప్రతి ష్టకు అవమానమని, మంత్రి రాజనర్సింహ జో క్యం చేసుకొని డైరెక్టరేట్ ఆఫ్ నర్సింగ్ ఏ ర్పాటు వేగవంతం చేయాలని కోరుతున్నారు.

డైరెక్టరేట్ వస్తే ప్రయోజనమేంటి...

నర్సింగ్‌ రంగంలో సమస్యలను పరిష్కరించి, ఆరోగ్యసేవలను మెరుగుపర్చడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షే మ శాఖ అన్ని రాష్ట్రాల్లో నర్సింగ్‌ విభాగం కోసం డైరెక్టరేట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. డైరెక్టరేట్ ఏర్పాటుతో న ర్సుల సర్వీస్‌ విషయాలు, పదోన్నతులు, ఖాళీల గుర్తింపు, సకాలంలో బదిలీలు వంటి అంశాలన్నీ దాని పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం నర్సులు మూడు విభాగాధిపతుల ఆధ్వ ర్యంలో పనిచేస్తున్నారు. డీఎంఈ, డీహెచ్‌, టీవీవీపీ పరిధి లో సుమారు 20 వేల మంది వరకు ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు లు, నర్సింగ్ ఫ్యాకల్టీ తదితర సిబ్బంది పనిచేస్తున్నారు. ఇం త పెద్దసంఖ్యలో ఉన్న స్టాఫ్‌నర్సులకు సంబంధించి పదో న్నతులు, సర్వీస్‌ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఏళ్లతరబడి ఆయా హెచ్‌వోడీల చుట్టూ తిర గాల్సి వస్తోంది. నర్సుల డిప్యూటేషన్‌, వర్క్‌ ఆర్డర్లు, ఫారి న్‌ సర్వీస్‌ డిప్యూటేషన్‌ లాంటి విషయాల్లో కూడా కా ర్యాలయాల చుట్టూ తిరిగినా పనయ్యే పరిస్థితి లేకుండా పో యింది. దీనికి తోడు డీఎంఈ పరిధిలో పనిచేసే సిబ్బంది, అధికారులు అవినీతిలో జోగుతూ పదోన్నతుల ఫైళ్లు ఆప డం, ఆమ్యామ్యాలు ఇచ్చిన వారికి అర్హతలు లేకున్నా పదోన్న తులు కట్టబెట్టడం వంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ నర్సింగ్ ఏర్పాటుతో ఇటువంటి సమస్యలన్నింటికీ అడ్డుకట్ట పడుతుందని నర్సింగ్ సంఘాలు చెబుతున్నారు.

Next Story