జనగణనలో ‘డబుల్’ ఎంట్రీ.. సర్వేపై సిబ్బందికి అవగాహన లేమి

by Malleboina Mahesh |

తెలంగాణలో జనగణన సర్వేలో అవగాహన లేమితో వివరాలు రెండుసార్లు నమోదవుతున్నాయి. ప్రజలు ప్రస్తుతం ఎక్కడ ఉంటే అక్కడే నమోదు చేయాలని అధికారులు తెలిపారు.

జనగణనలో ‘డబుల్’ ఎంట్రీ.. సర్వేపై సిబ్బందికి అవగాహన లేమి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా జనగణన హౌస్‌ లిస్టింగ్​ సర్వే (House Listing Survey) చురుగ్గా సాగుతోంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఎన్యుమరేటర్లకు సరైన అవగాహన లేకపోవడం, సర్వేపై సరియైన విధంగా శిక్షణ ఇవ్వకపోవడంతో క్షేత్ర స్థాయిలో తప్పులు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యానికి, ఆలోచనలకు అనుగుణంగా కాకుండా విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో జనగణన హౌస్‌లిస్టింగ్​సర్వే ఈనెల 11 నుంచి ప్రారంభమైంది. మొదటి రెండు, మూడు రోజులు ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాకులను మ్యాపింగ్ చేశారు.

అనంతరం సర్వే ప్రారంభించారు. జనగణనలో కొత్తగా తీసుకువచ్చిన సెల్ఫ్​ఎన్యుమరేషన్‌ ద్వారా రాష్ట్రంలో 5.20 లక్షల మంది తమ వివరాలను ఇప్పటికే నమోదు చేసుకున్నారు. ఇలా ఎవరికి వారు తమ కుటుంబ సభ్యులు, సొంత ఇంటికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు. ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఉపాధి అవసరాల రీత్యా సొంతూర్లను వదిలి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నందున వారంతా సొంత ప్రాంతం వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిసింది.

మరోసారి వివరాల నమోదు..

హైదరాబాద్‌లో ఉంటున్న వారంతా దాదాపు సొంత ఊరులోని వివరాలను సెల్ఫ్​ఎన్యుమరేషన్‌లో నమోదు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లు సెల్ఫ్​ఎన్యురేషన్​ద్వారా నమోదైన వివరాలను పరిగణలోకి తీసుకోకుండా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో నివసిస్తున్న వారి వివరాలను మళ్లీ రికార్డు చేస్తున్నట్లు తెలిసింది. సెల్ఫ్​రెన్యుమరేషన్ ద్వారా తాము ఇప్పటికే వేరే ప్రాంతంలో వివరాలు నమోదు చేశామని చెప్పినా ఎన్యుమరేటర్లు వినిపించుకోవడం లేదని, మరల ఎంట్రీ చేస్తున్నట్లు సమాచారం. ఇలా చేయడం వలన 2 సార్లు వివరాలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా జనాభా లెక్కల లక్ష్యం తప్పుదారి పట్టే ఛాన్స్ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, సిబ్బందికి సరియైన అవగాహన లేకనే ఇలా చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రజల ఎక్కడుంటే అక్కడే లిస్టింగ్..

హైదరాబాద్​మహానగరంలో అత్యధికులు అద్దె ఇళ్లలో ఉంటారు. వారికి మరొక ప్రాంతంలో శాశ్వత ఇళ్లు ఉండటంతో అక్కడి నుంచే తమ వివరాలను నమోదు చేసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. తాము ఇక్కడ పర్మినెంట్​ కాదనే ఉద్దేశంతో సొంతూరులో కొందరు వివరాలను నమోదు చేసుకున్నారు. కానీ, జనగణన అధికారులు చెబుతున్న నిబంధల ప్రకారం ప్రజలు నివసించే సాధారణ గృహాన్ని పరిగణలోకి తీసుకునే వివరాలను నమోదు చేస్తామని, సొంత ఇళ్లు, సొంత గ్రామం, ఇతర పథకాలతో జనగణనకు సంబంధం లేనందున ప్రజలు ప్రస్తుతం ఎక్కడ ఉంటే అక్కడే వివరాలను నమోదు చేసుకోవాలని జనగణన అధికారులు సూచిస్తున్నారు.

సాంకేతిక సమస్యలు..

హౌస్ ​లిస్టింగ్​ ప్రారంభం కావడంతో ఎన్యుమరేటర్లు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు జనగణన అధికారుల దృష్టికి వచ్చింది. మొదటిసారిగా డిజిటల్ విధానంలో వివరాలను నమోదు చేస్తుండటం, ఎంట్రీ సమయంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. దీనితో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హౌస్​లిస్టింగ్ సర్వే దాదాపుగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఒకేసారి 30 లక్షల మంది ఈ యాప్‌ను ఉపయోగించి వివరాలను నమోదు చేస్తున్నారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉపయోగించే యాప్​ఇదేనేమో అని ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు.

దీంతో సర్వర్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని గుర్తించారు. మరికొందరు ఎన్యుమరేటర్లు పాత ఫోన్‌లను వాడుతూ వివరాలను నమోదు చేస్తుండటం, యాప్‌ను ఉపయోగించడం కొత్త కావడం, సాంకేతికంగా పెద్దగా అవగాహన లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. వీటన్నంటి కోసం జిల్లా, రాష్ట్ర , జాతీయ స్థాయిలో క్విక్​రెస్పాన్స్​టీంలను ఏర్పాటు చేశారు.

Next Story