ఈ టీచింగ్ స్టాఫ్ మాకొద్దు బాబోయ్..! ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్లు

by Kema Shiva Kumar |

జాతీయ వైద్య కమిషన్ తీసుకున్న ఓ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్ల ఆగ్రహానికి కారణమవుతోంది.

ఈ టీచింగ్ స్టాఫ్ మాకొద్దు బాబోయ్..! ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్లు
X

దిశ తెలంగాణ బ్యూరో: జాతీయ వైద్య కమిషన్ తీసుకున్న ఓ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్ల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇప్పటి వరకు లేఖలకే పరిమితమైన వీరి వ్యతిరేకత ఏకంగా కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. ఎంబీబీఎస్ కోర్సుల్లో ఫ్యాకల్టీగా పలు సబ్జెక్టులను బోధించడానికి మెడికల్ ఎంఎస్సీ/పీహెచ్‌డీ హోల్డర్లను అనుమతించడమే సమస్యకు మూలంగా మారింది. ఈ నిబంధనలను సవాలు చేస్తూ వైద్యులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌లో, యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ (యూడీఎఫ్), వైద్యేతర అధ్యాపకులను అనుమతించడం వైద్య విద్యను పలుచన చేయడమేనని ..ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించడమేనని వాదించింది. గతంలో వైద్య సంస్థలలో పనిచేసే ఫ్యాకల్టీ అర్హతల నిబంధనలు, 2025ను విడుదల చేస్తూ, జాతీయ వైద్య కమిషన్ (ఎన్.ఎం.సీ) ఎంఎస్సీ, పీహెచ్‌డీ చేసిన వారు కీలకమైన అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ తో బాటు మైక్రోబయాలజీ విభాగాలలో ఫ్యాకల్టీగా పని చేయడానికి అనుమతించింది . ఓ వైపు దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లు పెరిగిన నేపధ్యంలో అధ్యాపకుల కొరత తీవ్రంకావడంతో ఈ నిర్ణయం తీసుకుంది..

వైద్య విద్యతో ఆటలాడొద్దని నిపుణుల ఆగ్రహం

నిజానికి ఈ సబ్జెక్టులలో తీసుకునే ఫాకల్టీ అందించే విద్యా నాణ్యతపైనే మొదటి నుండీ వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మెడిసిన్ తో పోలిస్తే మామూలు స్ధాయిలో సిలబస్ ఉండే ఆయా సిబ్బంది ఏ రకంగా తమ విధులకు న్యాయం చేయగలరనేది వీరి వాదన. అప్పట్లో, మెడికల్ ఎంఎస్సీ పీహెచ్‌డీ ఉపాధ్యాయుల నియామకం ప్రతి సబ్జెక్టుకు 30% వరకు ..బయోకెమిస్ట్రీలో 50% వరకూ వీరి సంఖ్య ఉండేది .అయితే, అక్టోబర్ 2020లో, అనాటమీ, బయోకెమిస్ట్రీ ఫిజియాలజీ వంటి సబ్జెక్టులలో మెడికల్ ఎంఎస్సీ/పీహెచ్‌డీ ఫ్యాకల్టీ ఈ శాతాన్ని ఎన్ఎంసీ 30% నుండి 15%కి తగ్గించింది, అయితే మైక్రోబయాలజీ ఫార్మకాలజీలో సున్నా శాతానికి తగ్గించింది అయితే మళ్ళీ 2025 నిబంధనలలో దీనిని సవరించి మైక్రోబయాలజీ ,ఫార్మకాలజీ సబ్జెక్టులలో 30%కి పెంచారు.

అసలు ఎందుకిలా..

దేశవ్యాప్తంగా కొత్తగా పెద్ద ఎత్తున వైద్య సంస్థల స్థాపన జరిగింది.పెరిగిన జనాభాకి అనుగుణంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్త వైద్య కోర్సుల ప్రారంభం, ఉన్న కోర్సులకు సీట్ల పెంపు & అసెస్‌మెంట్ రేటింగ్ నిబంధనలు, మారుస్తూ అప్పటికి అందుబాటులో ఉన్న పీహెచ్ డీ అభ్యర్ధులను మెడికల్ సబ్జెక్టులను బోధించడానికి అనుమతించింది. అయితే ఈ తొందరపాటు నిర్ణయం కారణంగా ఆయా సబ్జెక్టులకు సంబంధించి క్వాలిటీ పడిపోయిందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. వైద్య విద్యలో ఉండే లోతైన పరిశీలన, ప్రాక్టికాలిటీ అందించడంలో సదరు సిబ్బంది సైతం ఇబ్బంది పడ్డారని.. దీంతో ఆ కాలంలో వైద్య విద్యని అభ్యసించిన వారికి పూర్తిస్థాయిలో సబ్జెక్టు దొరకలేదని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. దీంతో చాలా కాలం పాటు తమ అభ్యంతరాలను లేఖల రూపంలో ఎన్ ఎం సి కి తెలియజేసిన డాక్టర్లు ఈసారి ఏకంగా కోర్ట్ మెట్లు ఎక్కారు.

Next Story