- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళారీల చేతిలో మోసపోవద్దు : హైడ్రా కమిషనర్
ప్రజలకు ఏవైనా ఫిర్యాదులుంటే నేరుగా హైడ్రాను సంప్రదించాలని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఒక ప్రకటనలో కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజలకు ఏవైనా ఫిర్యాదులుంటే నేరుగా హైడ్రాను సంప్రదించాలని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఒక ప్రకటనలో కోరారు. ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని సూచించారు. హైడ్రా అధికారులు మాకు బంధువులు, మిత్రులు, బాగా తెలుసంటూ ఎవరైనా నమ్మబలికితే వారి చేతుల్లో మోసపోవద్దని హెచ్చరించారు. ఎంతో నిబద్ధత, నిజాయితీతో హైడ్రా ఉద్యోగులంతా పని చేస్తున్నారని.. హైడ్రాకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులన్నా.. సమస్యలున్నా నేరుగా తమను సంప్రదించాలని కోరారు. గతంలో కూడా హైడ్రా అధికారులమంటూ మోసాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేశామన్నారు. తాజాగా మరో ముఠా.. ఒకరు వార్త ప్రసారం చేయడం.. మరొకరు హైడ్రా అధికారులు తెలుసంటూ మాట్లాడుతాను అని చెప్పడం.. ఇంకొకరు డబ్బులు దండుకోవడంతో హైడ్రా కమిషనర్ మరోసారి ప్రజలను అప్రమత్తం చేశారు. మోసపోవద్దని హెచ్చరించారు.
వెలుగులోకి వచ్చిన తాజా దందా..
ఇటీవల హైడ్రా అధికారులతో మాట్లాడుతానంటూ.. అందరి జీవితాల్లో `వెలుగు`లు నింపుతామని ప్రచారం చేసుకునే ఓ డిజిటల్ మీడియా రిపోర్టర్‌తో పాటు.. ఒకటి రెండు ఇంటర్వ్యూలు చేసి డిజిటల్ మీడియా ప్రతినిధిగా హడావిడి చేసే వ్యక్తి తోడై చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. వీరికి ఫేక్ సర్టిఫికేట్లతో న్యాయవాదిగా చెలామణి అవుతూ ఇటీవలే హైకోర్టు బార్ కౌన్సిల్ తొలగించిన వ్యక్తి కూడా తోడయ్యాడు. నువ్వు వార్త ప్రసారం చేయు.. నువ్వు హైడ్రా అధికారులతో మాట్లాడు.. నేను డబ్బులు తీసుకువస్తాను అని న్యాయవాది ఈ కథంతా నడిపి రూ. 50 లక్షలు వసూలు చేసినట్టు హైడ్రాకు ఫిర్యాదు వచ్చింది. వారి చేతిలో మోసపోయిన వ్యక్తినే హైడ్రాను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ మరోసారి ప్రజలను హెచ్చరించారు. ఫిర్యాదుదారులు నేరుగా హైడ్రా ఉన్నతాధికారులను సంప్రదించాలని.. సమస్య ఉంటే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇరు పక్షాల సమక్ష్యంలోనే విచారణ చేపట్టి న్యాయబద్ధంగా హైడ్రా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
కేసు బుక్ చేసిన హైడ్రా..
తుక్కుగూడ మున్సిపాలిటీ మంఖాల్ విలేజ్‌లో వర్టెక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ లే ఔట్ వేసింది. అక్కడి సూరం చెరువును ఆక్రమించడంతో పాటు కొత్తకుంటలో మట్టి పోసి..బాక్స్ డ్రైన్ నిర్మించిందనే ఫిర్యాదు హైడ్రాకు అందింది. ఈ విషయంలో హైడ్రా విచారణ చేపట్టింది. వర్టెక్స్‌పై రెండు కేసులు కూడా హైడ్రా పెట్టింది. ఇదే తరుణంలో తమ స్థలాన్ని ఆక్రమించి వర్టెక్స్ సంస్థ రోడ్డు వేసిందంటూ చైతన్య రెడ్డి హైడ్రాను ఆశ్రయించారు. రోడ్డును తొలగించాలనే ఫిర్యాదుతో ఇరు పక్షాలతో హైడ్రా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వెళ్లడైన అంశాల మేరకు.. చైతన్య రెడ్డి ఓ వ్యక్తికి రూ. 50 లక్షలు అందజేసినట్టు తేలింది. హైడ్రా పేరు చెప్పి.. మోసాలకు పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొంది. హైడ్రా పేరు చెప్పి డబ్బులు వసూలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. చైతన్య రెడ్డి ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. పహాడీషరీప్ పోలీసు స్టేషన్లో హైడ్రా కేసు పెట్టింది. మోసాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఈ సందర్భంగా మరోసారి హెచ్చరించారు.
మోసం బయటపడిందిలా..
వర్టెక్స్ సంస్థకు సంబంధించిన ఫిర్యాదులపై ఇరు పక్షాల సమక్షంలో విచారణ చేపట్టింది హైడ్రా. నిష్పక్ష పాతంగా జరుగుతున్న విచారణను చూసిన చైతన్య రెడ్డి తాను ఎలా మోసపోయానో వివరంగా హైడ్రా కమిషనర్ ముందు వాపోయింది. ఇద్దరు డిజిటల్ మీడియా ప్రతినిధులతో పాటు.. హైకోర్టు బార్ కౌన్సిల్ నుంచి తొలగించిన న్యాయవాది భాగోతం బయట పడింది. న్యాయవాది ప్రధాన పాత్రధారిగా ఇద్దరు మీడియా ప్రతినిధులు సాగించిన దందా వెలుగు చూసింది. సదరు న్యాయవాది రూ. 50 లక్షలు తీసుకోవడం.. వర్టెక్స్‌పై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని డిజిటల్ మీడియా ప్రతినిధి ప్రసారం చేయడం వెల్లడైంది. ఇదే సమయంలో హైడ్రా అధికారులు తెలుసంటూ మరో డిజిటల్ మీడియా ప్రతినిధి ఆడిన నాటకం కూడా తెలిసి వచ్చింది. ఇదే విషయమై చైతన్య రెడ్డిని, సదరు మీడియా ప్రతినిధిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించగా.. మోసం బయట పడింది. దీంతో ఆ ప్రతినిధి తెల్లముఖం వేయడం జరిగింది. హైడ్రా నిష్పక్షపాత విచారణను అన్ని దశల్లో చూసిన చైతన్య రెడ్డి.. తాను దళారుల చేతిలో మోసపోయానని గ్రహించి.. పూర్తి విషయాలను హైడ్రా ముందు వెల్లడించింది.
కొసమెరుపు:..
వర్టెక్స్‌నుంచి హైడ్రా అధికారులు లబ్ధి పొంది చైతన్య రెడ్డికి న్యాయం చేయడం లేదంటూ ఆరోపణలు చేస్తూ వెలుగులోకి తెద్దామని తెగ తాపత్రయం పడిన మీడియా ప్రతినిధి బండారం కూడా బయట పడింది. పై విషయాల్లో కీలక పాత్ర పోషించిన న్యాయవాది దగ్గరుండి.. సదరు మీడియా ప్రతినిధిని వర్టెక్స్‌కు తీసుకెళ్లి హైడ్రాపై లేని పోని ఆరోపణలు చేస్తూ వార్తను ప్రసారం చేసినట్టు వీడియో సాక్ష్యంగా వెల్లడైంది. మొత్తం ఈ ఉదంతంపై సాక్ష్యాధారాలతో పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్లో గురువారం హైడ్రా కేసు పెట్టింది. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను అందజేసింది. మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.






