బనకచర్ల ప్రాజెక్టు ఆపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా? లేదా..? హరీశ్‌ రావు సూటి ప్రశ్న

by Ramesh Naini |

ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును ఆపే ఉద్దేశ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉందా? లేదా? అని మాజీ మంత్రి హరీశ్ రావు సూటి ప్రశ్న వేశారు.

బనకచర్ల ప్రాజెక్టు ఆపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా? లేదా..? హరీశ్‌ రావు సూటి ప్రశ్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాత డేట్ (10-10-2025) తో నేడు లేఖ విడుదల చేయడం తప్ప.. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును ఆపే ఉద్దేశ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉందా? లేదా? అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సూటి ప్రశ్న వేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు (Banakacherla Project) పీఎఫ్ఆర్ టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్‌లో ఉందని, ప్రాసెస్ చేస్తున్నాం అని స్పష్టం చేస్తూ.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సెప్టెంబర్ 23 నాడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఉత్తరం రాశారని తెలిపారు. ఇదే విషయాన్ని నేను అక్టోబర్ 11 తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించి నిలదీశానని అన్నారు. అనుమతులు ఇవ్వొద్దు అంటూ కేంద్ర మంత్రికి ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయకపోవడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.

అక్టోబర్ 6 నాడు ఏపీ DPR టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాన్ని అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రికి సీఎం గానీ, ఇరిగేషన్ శాఖ మంత్రిగానీ ఇప్పటివరకు ఎందుకు ఉత్తరం రాయలేదు? అని ప్రశ్నించారు. ఇదే విషయంలో తెలంగాణ ఇరిగేషన్ సెక్రెటరీ, ఎందుకు కేంద్ర జలశక్తి సెక్రటరీకి ఉత్తరం రాయడం లేదు? అని ప్రశ్నించారు. పాత డేట్ వేసి, ఈఎన్సీతో CWCకి ఉత్తరం రాస్తే ఏం లాభం? అని ప్రశ్నించారు. ఒకవైపు ఏపీ అక్రమ ప్రాజెక్టు కట్టేందుకు వేగంగా ముందుకు కదులుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలను బ్యాక్ డేటెడ్ లెటర్లతో మభ్య పడుతోందన్నారు. గోదావరి నదీ జలాలను వరద జలాల పేరిట తరలించేందుకు తలపెట్టిన ఏపీ అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు మొదలు.. డీపీఆర్‌కు టెండర్లు ఆహ్వానించే వరకు ప్రతి సారి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, నిద్ర లేపుతూ వచ్చిందన్నారు. తెలంగాణ భవన్ వేదికగా మొన్న ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే, మూడు రోజుల తర్వాత నెమ్మదిగా నిద్రలేచి పాత డేట్‌తో లేఖ విడుదల చేయడం సిగ్గుచేటని విమర్శించారు.

బనకచర్లను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నిలదీసిన ప్రతి సారి.. లేఖలు రాయడం, 'మమా' అనిపించి చేతులు దులుపుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. కర్ణాటక కాంగ్రెస్, ఆంధ్రా టీడీపీ, మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటాను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుంటే రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ఆరోపించారు. 22 నెలల్లో 55 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి.. ఏనాడూ తెలంగాణ నీటి ప్రయోజనాలు గుర్తు రాకపోవడం మన దౌర్భాగ్యమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కుళ్ళు రాజకీయాలు మానేసి తెలంగాణ ప్రయోజనాల కొరకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళు.. తెలంగాణ నీటి హక్కులు కాపాడటం కోసం న్యాయ పోరాటానికి సిద్ధపడు.. అని హితువు పలికారు.

Next Story