వైద్యులు పరిశోధనా రంగంలోనూ రాణించాలి : మంత్రి దామోదర్ రాజనర్సింహ

by Muthe.Rajitha |

వైద్యులు పరిశోధనా రంగంలోనూ రాణించాలి : మంత్రి దామోదర్ రాజనర్సింహ
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యులుగా పట్టా పుచ్చుకోవడమే కాకుండా, విద్యార్థులు పరిశోధనా రంగంలోనూ రాణించేలా ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. వైద్య విద్య ప్రమాణాలను పెంచడం ద్వారానే మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందించగలమని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల పనితీరుపై నియమించిన ఎంసీఎంసీ(మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ) కమిటీలు ప్రతి నెలా నివేదికలు ఇవ్వాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. రాష్ట్రంలో వైద్య విద్య నాణ్యతను మరింత మెరుగుపరచడం, పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడమే లక్ష్యంగా గురువారం సచివాలయంలో మంత్రి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల పనితీరు, విద్యార్థులకు అందుతున్న వసతులు, విద్యా బోధన నాణ్యతపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. దీనివల్ల నిరుపేద విద్యార్థులకు ఉన్నత వైద్య విద్య అందుబాటులోకి రావడంతో పాటు, ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ వైద్యుల సేవలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రస్తుత మెడికల్ పీజీ అడ్మిషన్ల ప్రక్రియపైనా సమావేశంలో చర్చించారు.

మెడికోలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెరిగిన కాలేజీలు, యూజీ, పీజీ సీట్ల సంఖ్యకు అనుగుణంగా కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో పరిపాలనా సౌలభ్యం కోసం అధికారులు, సిబ్బంది సంఖ్యను పెంచుకోవాల్సిన ఆవశ్యకతను మంత్రి గుర్తించినట్లు తెలిపిన మంత్రి... అందుకు తగ్గట్లుగా అధికారులు, సిబ్బంది సంఖ్యను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రటరీ, వీసీకి సూచించారు. పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత, వేగం కోసం ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు.

యూనివర్సిటీ కార్యకలాపాలన్నింటినీ పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని, తద్వారా విద్యార్థులకు సేవలు వేగవంతంగా అందుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జున రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story