- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో అక్రమాలు!.. డాక్టర్స్ ఫెడరేషన్ తీవ్ర ఆందోళన
తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ (TDF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అభ్యర్థుల నుండి అందిన అనేక నివేదికలు, విజ్ఞప్తుల ప్రకారం, ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని గుర్తించినట్టు పేర్కొంది. ముఖ్యంగా మూల్యాంకనం, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేకపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపింది. మార్కుల కేటాయింపులో అస్థిరతలు ఉన్నాయని, నియామక ప్రక్రియ కచ్చితమైన మెరిట్ ప్రాతిపదికన జరగలేదని అనుమానం వ్యక్తం చేసింది. ఒక్కో పోస్టుకు రూ.12 లక్షల నుండి రూ.20 లక్షల వరకు డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులు అందినట్టు తెలిపింది. వివిధ విభాగాల్లోని సుమారు 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని పేర్కొంది.
వైద్య విద్యలో నియామకాలు అత్యున్నత స్థాయి పారదర్శకతతో జరగాలని TDF స్పష్టం చేసింది. లేదంటే అది రాష్ట్రంలోని వైద్య సేవలు, వైద్య విద్య నాణ్యతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను డిమాండ్ చేసింది. ఎంపిక ప్రమాణాలు, మూల్యాంకనంలో పూర్తి పారదర్శకతను పాటించాలని స్పష్టం చేసింది. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు లేదా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అర్హులైన అభ్యర్థుల హక్కులు మరియు ప్రయోజనాలను కాపాడాలని తెలిపింది. అన్ని వైద్య, విద్యా ప్రక్రియలలో నైతిక ప్రమాణాలు, నిష్పాక్షికతను కాపాడటానికి TDF కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.






