టీవీవీపీలో రీ-డెప్లాయ్‌మెంట్ ప్రక్రియపై వైద్యుల ఆందోళన

by Malleboina Mahesh |   (  Updated:2026-07-12 16:05:42  IST  )

టీవీవీపీలో రీ-డెప్లాయ్‌మెంట్‌పై వైద్యుల ఆందోళన.. నియామకాలు పూర్తి కావాలంటే రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలని డిమాండ్!

టీవీవీపీలో రీ-డెప్లాయ్‌మెంట్ ప్రక్రియపై వైద్యుల ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీవీవీపీ పరిధిలోని హాస్పిటల్స్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా జనరల్ ట్రాన్స్‌ఫర్లలో ఇప్పటివరకు జీరో క్యాడర్ స్ట్రెంత్ (డీహెచ్ నుంచి వచ్చిన హాస్పిటల్స్) ఉన్న చోట్ల తక్షణమే క్యాడర్ స్ట్రెంత్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సాధారణ బదిలీల్లో పలువురు వైద్యులకు ఊరట లభించింది. మరోవైపు బదిలీల ప్రక్రియ సాగుతున్నప్పటికీ రీ-డెప్లాయ్‌మెంట్‌పై వైద్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మెడికల్ కాలేజీలకు వెళ్లిన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పోస్టులు ఇంకా పూర్తిస్థాయిలో వీవీపీ హాస్పిటల్స్‌కు రాలేదని, దీంతో జనరల్ ట్రాన్స్‌ఫర్లలో మిగిలిన పోస్టులను మాత్రమే చూపిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

కొత్తగా పోస్టులు శాంక్షన్ చేసే పరిస్థితి లేనందున, మిగిలిన పోస్టులన్నింటినీ ముందుగా అప్‌గ్రేడెడ్ హాస్పిటల్స్‌కు అలాట్‌మెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేయకుండా రీ-డెప్లాయ్‌మెంట్ చేస్తే సీనియర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అసోసియేషన్ నేతలు హెచ్చరిస్తున్నారు. మొత్తం పోస్టుల అలాకేషన్ పూర్తయిన తర్వాతే రీ-డెప్లాయ్‌మెంట్ చేయాలని, ఆ తర్వాతే ప్రమోషన్లు చేపట్టాలని వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అతి త్వరలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, దీనిపై ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని వైద్యులు కోరుతున్నారు.

రెగ్యులర్ కమిషనర్ ఎప్పుడు?

మరోవైపు టీవీవీపీలో రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో పరిపాలనలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. మే 31తో డాక్టర్ అజయ్ కుమార్ పదవీ విరమణ చేసినప్పటి నుంచి, ఇన్-ఛార్జ్ పాలననే కొనసాగుతోంది. దీనివల్ల 612 అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 330కి పైగా నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. అపాయింట్‌మెంట్ లెటర్లు అందినప్పటికీ, కౌన్సెలింగ్ జరగక పోస్టులు దక్కని పరిస్థితి ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించాలని, తద్వారా వైద్యులు, ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story