డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కొద్దు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

by Kema Shiva Kumar |

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కొద్దు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, అయితే ఇండియా కూటమి వీటికి వ్యతిరేకమని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ అంశంలో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తానంటే కుదరదని స్పష్టం చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తన అభిప్రాయాన్ని వెల్లడించారని చామల గుర్తు చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి, అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని ఖర్గే సూచించారని తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం..

2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, అయితే వీటి అమలుపై జరిగే చర్చల్లో అన్ని రాజకీయ పక్షాలను భాగస్వామ్యం చేయాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు. "ప్రస్తుతం ఉన్న 543 సీట్లకు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, కేవలం జనాభా ప్రాతిపదికన (ప్రోరేటా ప్రకారం) డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే నిధుల పంపిణీ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన..

సీట్ల పెంపుదల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రతిపాదన చేశారని చామల తెలిపారు. జనాభా ప్రాతిపదికన 50 శాతం, రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధి ఆధారంగా మిగిలిన 50 శాతం సీట్లు పెంచాలని రేవంత్ సూచించారని, దీనిపై ఇప్పటికే ఆయన ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు కూడా రాశారని పేర్కొన్నారు. కేంద్రం ప్రతిపాదించిన 850 సీట్ల పెంపుదలపై గందరగోళం నెలకొందని, పార్లమెంట్‌లో బలం ఉందని ప్రతిపక్షాలను 'బుల్డోజ్' చేసే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. 2026 జనగణనను పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనే విషయంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని, కాంగ్రెస్ ఎన్నడూ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.

Next Story