- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంచార జాతులకు ‘డీఎన్‌టీ’ సర్టిఫికేట్లు: తెలంగాణ బీసీ కమిషన్‌తో జాతీయ బోర్డు భేటీ
తెలంగాణలో సంచార, అర్థ సంచార జాతులకు డీఎన్‌టీ సర్టిఫికేట్లు జారీ చేసేందుకు బీసీ కమిషన్ చర్యలు చేపట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన డీనోటిఫైడ్, సంచార, అర్ధసంచార జాతుల అభివృద్ధి, సంక్షేమ బోర్డు (జాతీయ డీఎన్‌టీ బోర్డు) ఆధ్వర్యంలో సంచార, అర్థ సంచార జాతుల కోసం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపైన అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా బోర్డు సభ్యులు భారత్‌భాయ్ బాబుభాయ్ పాట్ని, ప్రవీణ్ శివాజి రావ్ ఘుగే శనివారం తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్, కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి బోర్డు సభ్యులతో సమావేశమై కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న సీడ్ పథకంలో అర్హులను గుర్తించడానికి డీఎన్‌టీ సర్టిఫికేట్ల జారీ గురించి చర్చించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని డీఎన్‌టీ, సంచార, అర్ధసంచార కులాలను సమగ్ర అధ్యయనం ద్వారా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత ఆయా కులాల వారికి డీఎన్‌టీ సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. జాతీయ డీఎన్‌టీ బోర్డు సభ్యులు మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటివరకు 7 రాష్ట్రాలలో మాత్రమే డీఎన్‌టీ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారని, మిగతా రాష్ట్రాలలో కూడా డీఎన్‌టీ సర్టిఫికేట్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను సందర్శించి, సంబంధిత అధికారులకు అవగాహన కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలుచేస్తున్న ఈ పథకంలో విద్యార్థులు వివిధ ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ సంబంధిత పరీక్షల కోసం శిక్షణ పొందడానికి స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తున్నట్లుగా ఉపాధికల్పన, గృహ నిర్మాణం తదితర అంశాల కోసం లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిచనున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల నాయకులు జాతీయ డీఎన్‌టీ బోర్డు సభ్యులను, రాష్ట్ర బీసీ కమిషన్‌ను కలిసి రాష్ట్రంలో సాధ్యమయినంత త్వరగా ఈ పథకాన్ని ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీప్యూటీ డైరెక్టర్ యు.శ్రీనివాస రావు, సహాయ కార్యదర్శి కె.మనోహర్ రావు, ప్రత్యేక అధికారి కుమారి ఎన్.సునీత, సెక్షన్ ఆఫీసర్ జి.సతీష్ కుమార్, రీసెర్చ్ ఆఫీసర్ జి.లక్క్ష్మీనారాయణలు పాల్గొన్నారు.






