TG: వాటిపై CM రేవంత్, భట్టి, ఉత్తమ్ ఫొటోలు.. వచ్చే నెల ‘రేషన్‌’తో పాటే పంపిణీ

by Gantepaka Srikanth |

రేషన్‌షాపుల ద్వారా లబ్ధిదారులకు ఇస్తున్న సన్నబియ్యంను వచ్చే నెల నుంచి ప్రత్యేక బ్యాగుల్లో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

TG: వాటిపై CM రేవంత్, భట్టి, ఉత్తమ్ ఫొటోలు.. వచ్చే నెల ‘రేషన్‌’తో పాటే పంపిణీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేషన్‌షాపుల ద్వారా లబ్ధిదారులకు ఇస్తున్న సన్నబియ్యంను వచ్చే నెల నుంచి ప్రత్యేక బ్యాగుల్లో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లా గోదాములకు బ్యాగులు చేరవేసినట్టు తెలిసింది. అక్కడి నుంచి మండలాల్లోని గోదాములకు ఈ నెలాఖరు వరకు పంపించనున్నట్టు తెలిసింది. ప్రతి లబ్ధిదారునికి బ్యాగులు అందజేసేలా చూడాలని పౌరసరఫరాల శాఖ సైతం డీలర్లకు సూత్రపాయంగా ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఈ బ్యాగులపై ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు ఉంటాయని తెలుస్తున్నది. ఈ బ్యాగును బయట కొనుగోలు చేయాలంటే రూ.50 వరకు ఉంటుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటో సైతం ఉంటుంది. వీటితో పాటు ఆరు గ్యారంటీలకు సంబంధించిన వివరాలు సైతం ముద్రించారు.

లబ్ధిదారునికి ఒకటి చొప్పన పంపిణీ

ప్రభుత్వం ఎంత మంది లబ్ధిదారులు ఉంటే అంత మందికి ఆరు కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నది. అదే విధంగా బ్యాగులు సైతం ఆరు కేజీల బియ్యానికి సరిపడే విధంగా తయారు చేసి ఇవ్వనున్నారు. ఇతర సమయాల్లో బ్యాగు తీసుకొని కూరగాయలు, కిరాణ సమాను తెచ్చుకునేలా నాణ్యతతో తయారు చేయించినట్టు పౌరసరఫరాల శాఖ పేర్కొంది. మరో వైపు ప్లాస్టిక్​సంచుల వాడకం తగ్గి పర్యావరణం కాపాడే అవకాశమూ ఉంటుంది. వీటిని లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలుస్తున్నది.

స్మార్ట్​కార్డుల పంపిణీపై కసరత్తు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత లబ్ధిదారులకు.. రేషన్‌కు సంబంధించి ఎలాంటి గుర్తింపు కార్డులూ ఇవ్వలేదు. పౌరసరఫరాల శాఖ పోర్టల్​నుంచి కార్డు నంబర్‌తో ఉన్న వివరాల కాపీని డౌన్‌లోడ్ చేసుకుని దాని ఆధారంగా లబ్ధిదారులు రేషన్​బియ్యం పొందుతున్నారు. వీరికి కొత్తగా స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని తయారు చేసేందుకు టెండర్లు పిలిస్తే కోట్​చేయడంతో కాంట్రాక్టర్ల మధ్య వ్యత్యాసాలు వచ్చాయి. దీంతో వారు న్యాయస్థానంలో దావా వేశారు. కోర్టు తీర్పు రాగానే కార్డులు పంపిణీ చేసేందుకు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. కార్డులో ఎవరి ఫొటోలు ఉండాలి? లోగో ఎలా ఉండాలి? అనే విషయాలకు సంబంధించిన అంశాలపై కసరత్తు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

బ్యాగుల పంపిణీతో ప్రభుత్వ పథకాల ప్రచారం

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పంపిణీ చేయబోయే బ్యాగులు ప్రచారానికి ఉపయోగపడుతాయనే టాక్​వినిపిస్తున్నది. రాష్ట్రంలో 97 లక్షల కార్డులు ఉండగా 3.10 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ప్రభుత్వం సన్నబియ్యంతో పాటు ప్రత్యేక బ్యాగులు ఇవ్వడంతో ఎన్నికల సమయంలో ఓటర్లు ప్రభుత్వం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story