- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిటైర్మెంట్ వయసు పెంపుపై సమాలోచనలు.. లాభనష్టాలపై సర్కార్ చర్చ!
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ఏడాది పెంచితే ఎలా ఉంటుంది? దాంతో ఏ మేరకు ఆర్థికంగా వెసులుబాటు కలుగనుంది? అలాగే రాజకీయంగా ఎలాంటి మైలేజ్ వస్తుంది? అనే అంశాలపై ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అందుకోసం ఆర్థిక శాఖ నుంచి ఈ ఏడాది రిటైర్డ్ కానున్న ఉద్యోగుల జాబితా, వారికి చెల్లించాల్సిన నిధుల మొత్తం వివరాలను తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఉన్నట్టుండి ఈ అంశంపై చర్చించడానికి ప్రధాన కారణం సర్కారును వెంటాడుతున్న ఆర్థిక వనరుల కొరతేనని తెలుస్తున్నది. ఇప్పటికే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో మరింత మంది ఉద్యోగ విరమణ పొందితే వారికి ఆర్థిక ప్రయోజనాలు అందించగలమా? లేదా? అనే కోణంలో చర్చిస్తున్నట్టు తెలుస్తున్నది.
రూ.9 వేల కోట్ల వెసులుబాటు
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 61 ఏండ్లు. దీన్ని మరో ఏడాది పాటు అంటే 62 ఏండ్లకు పెంచితే ఎలా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగ విరమణ వయస్సు పెంచితే ప్రభుత్వానికి చేకూరే లాభనష్టాల కోణంలోనూ చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా సగటున 800 మంది ఉద్యోగులు, ఏడాదిలో సుమారు 9 వేల మంది ఉద్యోగులు రిటైర్డ్ కానున్నారు. వీరందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం దాదాపు రూ.9 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం అంతటి ఆర్థిక వనరులు సమకూరుతాయా? లేదా? అని సర్కారు ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ వయస్సును పెంచితే మాత్రం ఒక ఏడాది పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, ఆ తరువాత ఏడాది నుంచి యథావిధిగా రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించక తప్పదు.
ఇప్పటికే రూ.8 వేల కోట్లు పెండింగ్
కేసీఆర్ హయాంలో ఎంప్లాయీస్ ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏండ్లకు పెంచడంతో రిటైర్ట్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించే ఇబ్బందులు రాలేదు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి ఉద్యోగుల ‘విరమణ’ మొదలైంది. దీనితో ఇప్పటివరకు దాదాపు 12 వేల మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. వారందరికీ చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఒక్కొక్కరికి సగటున రూ.కోటి వరకు ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆర్థిక వనరుల కొరత కారణంగా ‘విరమణ’ చేసిన ఉద్యోగులకు సుమారు రూ.8 వేల కోట్లు పెండింగ్‌లో పడ్డాయి. వారందరికీ ప్రతి నెలా కొంత మొత్తంలో చెల్లించాలని ప్లానింగ్ చేశారు. కానీ, ఇతర సంక్షేమ పథకాల కోసం నిధులు కేటాయించాల్సి రావడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం సమస్యగా మారిందని అధికారులు అంటున్నారు.
రాజకీయ ప్రయోజనం ఉంటుందా?
ఉద్యోగ విరమణ వయస్సును 61 నుంచి 62 ఏండ్లకు పెంచితే ఉద్యోగులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే కోణంలోనూ ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఉద్యోగులు తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు (డీఏ, సరెండర్ లీవ్స్, పీఎఫ్, మెడికల్ బిల్స్) అందడం లేదని గుర్రుగా ఉన్నారు. మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులు సైతం తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఏడాది పాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలా? వద్దా? అని ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.






