- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలిగిన ఆశావహులు.. మొదలైన బుజ్జగింపులు.. సీఎన్ రెడ్డితో మంత్రుల సమావేశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కేటాయింపుతో కాంగ్రెస్‌లో పలువురి నేతల్లో అసంతృప్తి మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కేటాయింపుతో కాంగ్రెస్‌లో పలువురి నేతల్లో అసంతృప్తి మొదలైంది. టికెట్ ఆశించిన ఇద్దరు నేతలు భంగపడ్డ నేపథ్యంలో వారిని బుజ్జగించే ప్రయత్నాలు పార్టీ అధిష్టానం ప్రారంభించింది. ఇప్పటికే, మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ ఇంటికి ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) వెళ్లి బుజ్జగింపులు చేశారు. అలాగే, శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. గత రెండు నెలలుగా ఉప ఎన్నిక టికెట్ కోసం తీవ్ర కసరత్తు చేసిన నేతలు చివరకు నిరాశ చెందారు. టికెట్ నవీన్ యాదవ్‌కు కేటాయించడంతో, అంజన్‌కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav), సీ.ఎన్. రెడ్డి (CN Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అసంతృప్తిని సద్దుమణిగేలా పార్టీ నాయకత్వం చర్యలు ప్రారంభించింది.
శుక్రవారం సీ.ఎన్. రెడ్డి నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఏఐసీసీ ఇన్‌చార్జి సెక్రటరీ విశ్వనాథన్, రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం నవీన్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటించిందని, ఆయన విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ పట్ల ప్రజల నమ్మకాన్ని మరింత బలపరచాలని మంత్రి సూచించారు. పార్టీ లోపల ఎలాంటి అసంతృప్తి లేదని, సీ.ఎన్. రెడ్డి నాయకత్వంలో రహమత్ నగర్ డివిజన్‌లో భారీ మెజారిటీతో గెలుపు సాధించాలన్నారు.






