విద్యాశాఖ, కమిషన్ మధ్య విబేధాలు

by Malleboina Mahesh |

తెలంగాణలోని విద్యాశాఖ, విద్యాకమిషన్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అధికారుల ఇగోల వల్లే చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా చేసినట్లు ప్రచారం.

విద్యాశాఖ, కమిషన్ మధ్య విబేధాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పరస్పర సహకారం, సమన్వయంతో పని చేయాల్సిన విద్యాశాఖ, విద్యా కమిషన్ మధ్య విబేధాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తామే సుప్రీం అంటే.. కాదు తామే సుప్రీం అనే రీతిలో డిపార్ట్‌మెంట్, కమిషన్ వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ ఆధిపత్య పోరు కారణంగా విద్యార్థులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు అమల్లోకి రాకుండా పోతున్నాయని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఆ ఇంటర్నల్ వార్‌తో విసిగిపోయిన విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి.. పదవీకాలం పూర్తికాక ముందే రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.

ఎవరి ఇగో వారిదే!

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం సలహాలు, సూచనలు ఇచ్చేందుకు విద్యాకమిషన్‌ను ఏర్పాటు చేసింది. పలు దేశాలు, రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై స్టడీ చేసిన ఈ కమిషన్.. ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. అందులో అవసరమైన అంశాలను విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం అనుమతి తీసుకుని అమలు చేయాలి. కానీ, కమిషన్ విషయంలో విద్యాశాఖ పట్టించుకోనట్టు వ్యవహరించిందనే చర్చ జరిగింది. అంతేకాకుండా విద్యాశాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు, విద్యా కమిషన్ బాధ్యతల్లో ఉన్న రిటైర్డ్ ఐఏఎస్, ప్రొఫెసర్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

కొన్నిసార్లు కమిషన్‌కు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో కూడా విద్యాశాఖ జాప్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు శాఖ అధికారులు కమిషన్ పట్ల చులకన గా వ్యవహరిస్తూ.. ‘విద్యాశాఖ ఉండగా మళ్లీ కమిషన్ ఎందుకు? అనవసరపు ఖర్చు. లక్షల్లో జీత భత్యాలు వృథా’ అని పలుసార్లు కామెంట్ చేసినట్లు తెలుస్తున్నది. అందుకు ప్రతిగా కమిషన్ సైతం అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తూ ‘బ్యూరోక్రట్స్‌కు ఏం తెలుసు. సర్కారు ఇచ్చే సకల సౌకర్యాలు అనుభవిస్తారు తప్పా నిరుపేద విద్యార్థుల గురించి వారికి పట్టింపు ఉండదు’ అని కామెంట్ చేసినట్లు తెలిసింది.

సూచనలు పట్టించుకోని విద్యాశాఖ

తాము ఇచ్చిన సలహాలు, సూచనలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని కమిషన్ పలుసార్లు కోరినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. సర్కారు ముందు ఎప్పుడు ఏ అంశాన్ని తీసుకెళ్లాలో తమకు బాగా తెలుసు అనే తీరుగా బ్యూరోక్రాట్స్ వ్యవహరించినట్లు తెలిసింది. దీంతో ప్రైవేటు స్కూల్స్ విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులను కట్టడి చేసేందుకు ‘ఫీ రెగ్యులేటరీ కమిషన్’ బిల్లు కేబినెట్ ముందుకు రావడంలో ఆలస్యం జరిగినట్లు సమాచారం. అలాగే టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలంటూ కమిషన్ చేసిన సిఫారసును విద్యాశాఖ సీరియస్‌గా తీసుకోకపోవడంతో వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమల్లోకి రాకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి.

ఆమె వల్లే మురళి రాజీనామా?

విద్యా శాఖలో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారిణి వల్లే ఆకునూరి మురళీ తన పదవికి రాజీనామా చేసినట్లు చర్చ జరుగుతున్నది. ప్రతి విషయంలో ఇగో చూపించడం వల్ల విసిగిపోయిన ఆయన.. పదవీకాలం పూర్తికాక ముందే బయటకు వెళ్లిపోయారనే టాక్ ఉంది. ఈ మధ్య కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేస్తూ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టులో సదరు అధికారి పేరు లేకపోవడంతో చిరాకుతో కమిషన్ సిఫారసులనే తేలికగా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

Next Story