తెలంగాణ రవాణా శాఖలో డిజిటల్ విప్లవం: రేపటి నుంచే ‘వాహన్’ సేవలు షురూ

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-10 04:10:43  IST  )

తెలంగాణ రవాణా శాఖలో డిజిటల్ విప్లవం రానుంది. ఇకపై వాహన షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ (PR) ప్రక్రియ పూర్తి కానుంది.

తెలంగాణ రవాణా శాఖలో డిజిటల్ విప్లవం: రేపటి నుంచే ‘వాహన్’ సేవలు షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రవాణా శాఖలో దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ, సామాన్యుడికి ఊరటనిచ్చేలా డిజిటల్ విప్లవం మొదలైంది. కొత్త వాహనం కొన్నారా? అయితే ఇక రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహన్ పోర్టల్‌ను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే తాత్కాలిక రిజిస్ట్రేషన్లలో (టీఆర్) సక్సెస్ సాధించిన రవాణా శాఖ, శనివారం (ఏప్రిల్ 11) నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ల (పీఆర్) ప్రక్రియను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది.

డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్..

పారదర్శకతను పెంచడం, మధ్యవర్తుల బెడదను నివారించడమే లక్ష్యంగా రవాణా శాఖ డిజిటల్ మార్పులను వేగవంతం చేసింది. మార్చి 23 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 33,000 తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,000 మంది వాహన డీలర్లకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే 671 మంది డీలర్లను పోర్టల్‌లో ఆన్‌బోర్డ్ చేయగా, 346 ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్లను పూర్తి చేశారు. దీనివల్ల షోరూమ్ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. కొత్త వాహనదారులకు ఊరటనిస్తూ ఏప్రిల్ 11 నుంచి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) ప్రక్రియను ప్రారంభించనున్నారు. వాహనం కొన్న వెంటనే త్వరితగతిన నంబర్ కేటాయింపు జరిగేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. దశలవారీగా అన్ని రకాల రవాణా సేవలను వాహన్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

స్మార్ట్‌ఫోన్‌లోనే ఆర్‌సీ, లైసెన్స్..

వాహనదారులు ఫిజికల్ కార్డ్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జెన్ ఎం పరివాహన్ యాప్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్)లను డిజిటల్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ తనిఖీల సమయంలో వీటిని చూపించినా చెల్లుబాటు అయ్యేలా నిబంధనలు రూపొందించారు. సాంకేతికతను జోడించి పౌర సేవలను ఇంటి వద్దకే చేర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవలను ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తెస్తామని రవాణా శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Next Story