- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాట్ టాపిక్‌గా మారిన మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. భిన్నాభిప్రాయాలు వస్తుండటంతో ముందుగా అక్కడి నుంచే షురూ!
రేపటి నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు చేపట్టనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రేపటి నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీనిని పార్టీలోని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు అభ్యంతరం చెబుతున్నారు. పాదయాత్ర వల్ల కేడర్‌లో ఉత్సాహం నింపడంతో పాటు పథకాలకు మరింత ప్రచారం లభిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు సరికావని, దీనివల్ల సర్కారు ప్రాధాన్యత తగ్గే ప్రమాదం ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పథకాలు అందని వారిని విపక్షాలు ప్రేరేపించి పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో తొలి విడత
కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న పరిగి, అందోల్, ఖానాపూర్, వర్దన్నపేట, చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో తొలి విడతగా పాదయాత్రలు, శ్రమదానం చేపట్టనున్నారు. అదే సమయంలో ఆ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దాంతో పాటు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అమలు చేయాల్సిన వ్యూహాలను వివరించున్నారు. ఈ కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహంతో పాటు, జిల్లా పార్టీ యాక్టివ్ అవడం, పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలకు సైతం చెక్ పెట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వాన్ని కాదని పార్టీ యాత్రలా?
విపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే, పార్టీకి ఆదరణ లభిస్తుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలనూ నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటిని పరిష్కరించేందుకు శ్రమదానం ఉపయోగపడుతుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవచ్చు. సర్కారు ఆదేశిస్తే, వెంటనే రంగంలోకి దిగే మెకానిజం సెక్రటేరియట్ మొదలు గ్రామాల వరకు ఉంటుంది. కానీ అలా కాకుండా అధికార పార్టీ తరఫున పాదయాత్రలు, శ్రమదానం చేయడం వల్ల ప్రభుత్వ ఇమేజ్ తగ్గే ప్రమాదం ఉందని పార్టీలోని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీనాక్షి పాదయాత్ర షెడ్యూలు ప్రకటించిన మరుక్షణం నుంచే సర్కారు సరిగా పనిచేయకపోవడం వల్లే పార్టీ నేతలు రంగంలోకి దిగారని ప్రతిపక్షాల నుంచి సెటైర్లు మొదలయ్యాయి.
విపక్షాలు అడ్డుకునే ప్రమాదం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు సంక్షేమ పథకాలు ప్రారంభించింది. కానీ ఇంకా కొన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. అమలు కానీ పథకాలను అస్త్రంగా చేసుకుని పాదయాత్రను విపక్షాలు అడ్డుకునే ప్రమాదం ఉందన్న చర్చ జరుగుతున్నది. చాలా గ్రామాల్లో ఇప్పటికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కులు, సన్నబియ్యం బోనస్ అందలేదని విమర్శలు వస్తున్నాయి. పథకాలు అందలేదని అసంతృప్తితో ఉన్న ప్రజలు పాదయాత్రను అడ్డుకునే విధంగా ప్రతిపక్షాలు ప్రేరపించే ప్రమాదం ఉందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే మంత్రులు ఏ కార్యక్రమం చేపట్టిన ఆందోళనలు చేసేందుకు ప్రతిపక్ష లీడర్లు రెడీగా ఉంటున్నారు. వారందరిని గుర్తించి, పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ చేపడుతున్న పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు రాకుండా పోలీసు బందోబస్తు కల్పిస్తే, మరిన్ని విమర్శలు వచ్చే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతున్నది.






