BRS: బలమే బలహీనతగా.. కీలక సమయంలో సోషల్ మీడియా వారియర్స్ మధ్య ఆధిపత్య పోరు!

by Prasad Jukanti |   (  Updated:2025-12-05 09:42:22  IST  )

బీఆర్ఎస్ సోషల్ మీడియాలో లుకలకలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

BRS: బలమే బలహీనతగా.. కీలక సమయంలో సోషల్ మీడియా వారియర్స్ మధ్య ఆధిపత్య పోరు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సోషల్ మీడియా రాజకీయాలు (Social media politics) ఇంట్రెస్టింగ్‍గా మారాయి. మారుతున్న ఆధునిక పోకడతో పాటు రాజకీయ పార్టీలు సైతం తమ సోషల్ మీడియా విభాగాలను బలోపేతం చేస్తున్నాయి. ప్రత్యర్థులను డిఫెన్స్ లోకి నెట్టాలన్నా వారిని చికాకు పెట్టించాలన్నా సోషల్ మీడియానే ఇప్పుడు ప్రధానాస్త్రంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకరిని మించి మరొక పార్టీ ఈ సోషల్ మీడియాను నమ్ముకుంటున్నాయి. పార్టీల తలరాతరను మార్చే శక్తి కలిగిన ఈ సోషల్ మీడియా ఇప్పుడు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో విషయంలో చర్చనీయాశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో కంటే సోషల్ మీడియా ద్వారానే బీఆర్ఎస్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వాన్ని ఎన్నికల్లో గద్దె దించేందుకు సోషల్ మీడియానే తమ కీలక ఆయుధంగా మలుచుకోవాలని భావిస్తున్న గులాబీ పార్టీ సోషల్ మీడియా (BRS social media) సైన్యంలో లుకలుకలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కీలక ఆధిపత్యపోరు:

గత ఎన్నికల్లో తమ ఓటమి విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందిస్తూ తాము అధికారంలో ఉండగా మెడికల్ కాలేజీలు కాకుండా యూట్యూబ్ చానల్స్ పెడితే గెలిచేవాళ్లం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత అనేక యూట్యూబ్ చానల్స్ బీఆర్ఎస్‍కు అనుకూలంగా పుట్టుకురావడం రాష్ట్ర రాజకీయాలు పరిచయం ఉన్నవారికి తెలిసిన విషయమే. ఓ వైపు వరుస ఓటములతో సతమతం అవుతున్న వేళ బీఆర్ఎస్‍కు ఉన్న సోషల్ మీడియా సైన్యం ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తూ వస్తోంది. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా సోషల్ మీడియా విభాగం స్ట్రెంథ్ ఆన్ చేసేలా పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగంలో ఆధిపత్య పోరు నడుస్తోందనే టాక్ చర్చనీయాశం అవుతోంది. తాము బీఆర్ఎస్ కు కట్టర్ అభిమానులం అని చెప్పుకునే వారు సైతం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కామెంట్ల స్క్రీన్ షార్టులు ఇప్పుడు వైరల్‍గా మారాయి. ఉద్యమంలో ఏనాడు కనబడని వారు కొత్త జిమ్మికులతో రీల్స్ చేస్తూ హడావుడి చేస్తుంటే.. మా అడుగులు తడబడినా గులాబీ జెండాను గుండెపై మోస్తున్న మేము జనం ముందు జూనియర్లుగా నిలబడే పరిస్థితి ఉందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వారియరా గా సీనియార్టీ లేని కొంత మంది సీనియర్ ఉద్యమ నాయకులుగా పిలవబడుతుంటే మేమేం చేయగలం మేం చేసిన ఉద్యమం ఓ జ్ఞాపకంగా మిగిలిపోనుందా? అంటూ తమ బాధను వెల్లిబుచ్చుతున్న తీరు చర్చనీయాశం అవుతోంది. మనం వేసుకోవాల్సింది చేతి మీద పచ్చబొట్టు కాదు కోట్ల మంది గుండెల్లో బాపు పేరును నిలపడం మా ధ్యేయం. అలాగే నిలిపి చూపించిన వాళ్లం. కానీ కంచు మోగినట్టు కనకంబు మోగలేకపోతోందంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు కామెంట్స్ చేస్తూ మధ్యలో వచ్చి జీతాలు తీసుకునే వారు లీడర్స్, ఉద్యమ నాయకులు అయితే పార్టీ మొదటి నుంచి అహర్నిశలు కష్టపడి ఇంకా కష్టపడుతూ అన్ని కోల్పోయిన మేము ఏమిటీ అని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వారియర్స్ ను ప్రోత్సహిస్తున్నామన్న పేరుతో ఉద్యమకారులను అవమానిస్తున్నారని ఇది మంచిది కాదని మరికొంత మంది ఆవేదన చెందుతున్నారు. ఇలా బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ లోనే ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడంతో ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగంలో నిజమైన గుర్తింపు రావడం లేదని, ఎదైనా కేసులు అయినా కేవలం అగ్రనేతలకు టచ్ లో ఉన్నవారికి మాత్రమే మద్దతు లభిస్తోంది తప్ప క్షేత్రస్థాయిలో పని చేసే వారికి పార్టీ నుంచి అండదండలే అందడం లేదనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో రాబోయే 2028 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ పార్టీకి సోషల్ మీడియాలో సొంత వారి పోరు సమస్యాత్మకంగా మారబోతోందా అనే టాక్ వినిపిస్తోంది.

పార్టీ ముందు బిగ్ టాస్క్:

సోషల్ మీడియా అంటేనే రెండు వైపుల పదునున్న కత్తిలాంటింది. ప్రత్యర్థులపై సరైన రీతిలో ప్రయోగిస్తే ఆయుధం అవుతుంది అలా కాకుండా చేస్తే రివర్సై మన బెండే తీస్తుంది. ఈ విషయంలో రాజకీయ పార్టీలకు తెలియని సత్యమేమి కాదు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఇప్పుడు సోషల్ మీడియా బిగ్ టాస్క్ గా మారింది. ఓ వైపు సోషల్ మీడియా వారియర్స్, మరో వైపు ఉద్యమకారులు కలగలిపి ఇప్పుడు పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని ఏ మేరకు సమన్వయం చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. ఏ మాత్రం తేడా కొట్టినా పార్టీకి సంబంధించిన కీలక విషయాలు, వ్యూహాలు బహిర్గతమయ్యే ప్రమాదం కూడా ఉంది. అక్కడ జరుగుతున్న మానిటరింగ్ వ్యవహారాలు ప్రత్యర్థులకు బలంగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తన సోషల్ మీడియా విభాగంలోని వారి మధ్య విభేదాలు తొలగించి ఎలా సమన్వయం చేయబోతోంది అనేది వేచి చూడాలి.

Next Story