మే 11న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా: జాన్ వెస్లీ

by Malleboina Mahesh |

ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ మే 11న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాకు సీపీఎం పిలుపు! గన్నీ బ్యాగుల కొరత, తరుగు కోతలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు

మే 11న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా: జాన్ వెస్లీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసిన వరి, మొక్కజొన్న మరియు ఇతర పంటల కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల వల్ల అన్నదాతలు అల్లాడుతున్నారని, అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఐకేపీ, పీఏసీఎస్ మరియు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఆదివారం నుంచి సీపీఎం బృందాలు రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులు మరియు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని, మే 11న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఖమ్మం, నల్గొండ, ఉత్తర తెలంగాణ, ఉమ్మడి మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉండడంతో రైతులు ఒక్కో బస్తాకు రు.30 అదనంగా చెల్లించాల్సి వస్తోందని, యాప్ ద్వారా బుక్ చేయాల్సి వస్తున్నదని తెలిపారు. మరోవైపు, యుద్ధం మరియు డీజిల్ కొరత సాకుతో లారీలు రాకపోవడం వల్ల జాప్యం జరుగుతోందన్నారు. వర్షాల వల్ల పంటలు తడిసి పోతున్నాయని రైతులు దిగాలు పడుతుంటే, తేమ ఉందని ధరలు తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టానికి గురౌతున్నారని తెలిపారు.

దీంతో పాటు మిల్లుల యజమానులు, దళారులు తరుగు పేరుతో క్వింటాలుకు 3 నుండి 5 కిలోల వరకు కోతలు విధిస్తున్నారని, ఒకవైపు కొనుగోలు చేయడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుంటే, మరోవైపు అమ్మిన పంటకు డబ్బులు రావడానికి కూడా పక్షం రోజుల వరకు వేచి చూడాల్సిన స్థితి నెలకొందన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ మరియు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల ద్వారా కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని, మార్కెట్‌లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Next Story