Dharani: ‘ధరణి’ దరఖాస్తుదారులకు ఫోన్ కాల్స్.. హాట్ టాపిక్‌గా రెవెన్యూ ఉద్యోగుల తీరు

by Kema Shiva Kumar |

‘ఓ సారి వచ్చి కలిసి వెళ్లండి..’ అని ధరణి దరఖాస్తుదారులకు అధికారులు చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది.

Dharani: ‘ధరణి’ దరఖాస్తుదారులకు ఫోన్ కాల్స్.. హాట్ టాపిక్‌గా రెవెన్యూ ఉద్యోగుల తీరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఓ సారి వచ్చి కలిసి వెళ్లండి..’ అని ధరణి దరఖాస్తుదారులకు అధికారులు చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది. భూ సమస్య పరిష్కారానికి టీఎం 33 మాడ్యూల్‌లో అప్లయ్ చేసుకున్న ఓ దరఖాస్తుకు కింది నుంచి పైదాకా అధికారులంతా పాజిటివ్‌గానే రిపోర్ట్ పంపారు. ఆ తర్వాత దరఖాస్తుదారుడు ఓ అడ్వొకేట్‌ను వెంటబెట్టుకొని సమస్య, రిపోర్టు, పరిష్కారం వంటి అన్ని అంశాలనూ ఉన్నతాధికారులకు వివరించాడు. అయినా మళ్లీ వచ్చి కలిసి వెళ్లాలని చెప్పడంతో ఆయన ఖంగుతిన్నాడు. మొన్ననే డౌట్స్ అన్నీ క్లియర్ చేసి వచ్చానని, మళ్లీ ఎందుకు పిలుస్తున్నారో అర్థం కావడం లేదని వాపోతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మరోసారి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారేమోనని భయపడుతున్నాడు. పెద్దోళ్లే ఇలా చేస్తే ఎవరికి చెప్పుకోవాలోనని ఆందోళన చెందుతున్నాడు. అయితే ఇలాంటి ఫోన్లు చాలా మందికి వస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ప్రత్యక్షంగా ఉద్యోగులు, అధికారులను కలిసి వెళ్లాలన్న రిక్వెస్టులు, కొర్రీల వెనుక మతలబు ఏంటో అనే అనుమానాలకు వ్యక్తమవుతున్నది. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నా.. ఏదో ఒకటి సరిగ్గా లేదంటూ కొర్రీలు పెట్టడమో.. ఆఖరికి రిజెక్ట్ చేస్తే మళ్లీ ఎంత కాలం తిరగాలన్న ఆందోళన దరఖాస్తుదారులను వెంటాడుతున్నది.

ఎంత కాలం?

ధరణి పోర్టల్ బాధిత రైతులు అప్లికేషన్ పెట్టుకున్న నాటి నుంచి నెలల తరబడి.. కొందరైతే ఏండ్లుగా తిరుగుతూనే ఉన్నారు. ప్రధానంగా టీఎం 33, టీఎం 15 అప్లికేషన్లు పరిష్కారం కావడం లేదు. ఆర్ఐ, డీటీ, తహశీల్దార్లను వేడుకుంటే రికార్డులను వెరిఫై చేసి ఉన్నది ఉన్నట్టు రిపోర్టులు రాస్తున్నారు. ఆ తర్వాత ఏదో ఒక కొర్రీ పెడుతూ ఆర్డీవోలు ఫైళ్లను తిప్పి పంపిస్తున్నారు. వాళ్లనూ మెప్పించి ఆమోదింపజేసుకుంటే.. కలెక్టరేట్ స్థాయికి వెళ్తున్నాయి. ఇక అక్కడి అధికారులు, సిబ్బంది చిక్కరు.. దొరకరు అన్నట్టు పరిస్థితి. దొరికినా తహశీల్దార్, ఆర్డీవో క్లియర్ చేసిన ఫైళ్లల్లో తప్పొప్పులు వెతకడం మొదలు పెడుతున్నారు. డాక్యుమెంట్ రాయడం ఇలా కాదంటూ తిప్పి పంపిస్తున్నారు. మళ్లీ ఫైల్ మొదటికే వస్తున్నది. మళ్లీ మొదటి నుంచి అధికారులకు ఇష్టపడే రీతిలో రిపోర్ట్ పంపిస్తే ఆమోదిస్తున్నారు. ఆ తర్వాత మరో అధికారి దగ్గర పెండింగ్‌లో పడుతుంది. కొందరు తహశీల్దార్లు ఖారిజ్ ఖాతా డెఫినేషన్ ఏమిటో తెలుసుకోకుండా, పరిశీలించకుండా.. 50, 60 ఏండ్లుగా పట్టా అని ఉన్న భూములను ప్రభుత్వ భూమి అంటూ లెక్కలేనన్ని సార్లు దరఖాస్తులను రిజెక్ట్ చేస్తున్నారు. కనీసం ఆ క్లాసిఫికేషన్‌కు అర్థమేమిటో తెలుసుకొని రిపోర్టు పంపాలని కోరినా.. ఉన్నతాధికారుల నుంచి వివరణ ఇప్పించినా అర్థం చేసుకోకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కింది స్థాయి అధికారులంతా పాజిటివ్ రిపోర్ట్ పంపినా.. ఆమోదించకుండా ఉన్నతాధికారులు పెండింగ్‌లో పెడుతున్నారు. కొందరు రైతులు అడ్వొకేట్లను తీసుకెళ్లి దరఖాస్తు వివరాలు, సమస్య తీరు, పరిష్కారం వంటి అన్నింటినీ చెప్పిస్తున్నారు. అయినా పరిష్కరించడం లేదు. ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ‘ఓ సారి వచ్చి కలిసిపోండి’ అని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

కాదంటే తిరస్కరిస్తారనే భయం

రాష్ట్ర వ్యాప్తంగా తమ భూములను అన్యాయంగా నిషేధిత జాబితాలో నమోదు చేశారంటూ వేలాదిగా దరఖాస్తులు వచ్చాయి. కొన్నింటికి ఆరు నెలలైనా పరిష్కారం చూపడం లేదు. నెలల తరబడి ఎలాంటి సమాచారమూ ఉండడం లేదు. కొన్ని జిల్లాల్లోనైతే రెండేండ్ల తర్వాత కూడా అండర్ వెరిఫికేషన్ అని చూపించే అప్లికేషన్లు ఉన్నాయి. అయితే కొందరి దరఖాస్తులకు మాత్రం అర్జీ పెట్టుకున్న మరుసటి రోజే క్లియర్ చేసినవి ఉన్నాయి. తహశీల్దార్ రిపోర్ట్ పంపిన తేదీ, ఆర్డీవో రికమండ్ చేసిన తేదీ, అదనపు కలెక్టర్/కలెక్టర్ అప్రూవ్ చేసిన తేదీ, సీసీఎల్ఏలో అప్రూవ్ చేసిన తేదీ.. ఈ నాలుగైదు స్టేజీల్లో ఎంత కాలం? ఎందుకు పెండింగ్‌లో ఉంది? ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? ఇది పరిశీలిస్తే దరఖాస్తుల పరిష్కారం వెనకున్న మతలబు ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. ఆర్డీవో రికమండ్ చేసిన తర్వాత కలెక్టర్ దగ్గర, కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాత సీసీఎల్ఏ కార్యాలయంలో నెలల తరబడి పెండింగులో ఉంచుకోవడానికి కారణాలేమిటో ఆరా తీస్తే అసలు విషయాలు తెలుస్తాయని బాధితులు అంటున్నారు. అధికారులను నిలదీసే ధైర్యం బాధితులు చేయలేకపోతున్నారు. ఇప్పటికే ఏండ్ల తరబడి తిరుగుతున్న క్రమంలో ఏ అధికారితోనైనా గట్టిగా మాట్లాడితే ఏం కొర్రీ పెట్టి అసలుకే మోసం చేస్తారేమోనన్న భయం దరఖాస్తుదారులకు ఉన్నది. ‘ఓ సారి వచ్చి వెళ్లండి’ అని చెప్పినా ఎవరికి చెప్పుకోలేక ఆవేదన చెందుతున్నారు.

అంతా డిజిటల్.. అయినా కలవడం ఎందుకు?

ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ధరణి బాధిత రైతులు అరిగోసపడుతున్నారు. ప్రధానంగా టీఎం 33, టీఎం 15 అప్లికేషన్ల విషయంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా వీటికి సొల్యూషన్ చూపించకుండా రిజెక్ట్ చేస్తూ కాలయాపన చేస్తున్నారు. ఎన్నిసార్లు అప్లయ్ చేసినా తిరస్కరణే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి అంతా డిజిటల్ ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నది. కానీ తహశీల్దార్ నుంచి సీసీఎల్ఏ వరకు ఫిజికల్ కాపీలు అడుగుతున్నారు. దరఖాస్తుదారులను కలవాలంటూ ఫోన్లు చేస్తున్నారు. అప్లికేషన్ రిజెక్ట్ చేసినా, యాక్సెప్ట్ చేసినా వారి మొబైల్‌కు మెసేజ్ వెళ్లాలి. కానీ ఉన్నతాధికారుల కింద ఉండే సిబ్బంది వాళ్లకు ఫోన్లు చేస్తున్నారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల కింది స్థాయి సిబ్బంది ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తే దరఖాస్తుదారులకు ఫోన్లు చేశారా? లేదా? అన్న విషయం ఈజీగా తెలిసిపోతుంది.

అరగంట చాలు

నిజానికి టీఎం 33 అప్లికేషన్ పరిష్కరించేందుకు కేవలం 30 నిమిషాలు చాలు. ఓ అప్లికేషన్ ఎందుకు పరిష్కరించడం లేదంటూ అధికారి దగ్గరికి వెళ్తే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ సర్వే నంబర్‌లోని పట్టాదారులు, విస్తీర్ణం, మొత్తం విస్తీర్ణం.. వివరాలన్నీ తీసుకొని పరిశీలిస్తే.. ఎవరి పేరిట అధికంగా ఉన్నదో, ఊరు, పేరు లేని పట్టాదారుల పేర్లు ఏమిటో గుర్తించేందుకు పది నిమిషాలు పట్టింది. ఏవి క్యాన్సిల్ చేస్తే సేత్వార్ (ఆర్ఎస్ఆర్) ప్రకారం సరిగ్గా ఉంటుందో లెక్క తేల్చారు. ఇదంతా క్షణాల్లో పని పూర్తయ్యింది. ప్రతి తహశీల్దార్‌కు.. రైతుకు న్యాయం చేయాలన్న తపన ఉంటే రోజుకు కనీసం 16 అప్లికేషన్లు పరిష్కరించే వీలుంది. కానీ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పెండింగులో ఉన్న లక్షన్నర అప్లికేషన్లలో సగం టీఎం 33 ఆప్షన్ కింద వచ్చినవే. ఇప్పటి వరకు ఈ ఆప్షన్ కింద వచ్చిన వాటిలో 10 శాతం కూడా పరిష్కరించలేదు. అన్నింటినీ ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ అంటూ రిజెక్ట్ చేస్తున్నారు.

Next Story