ధరణి ఆపరేటర్ల దందా.. కొర్రీలు పెట్టి పైసలు గుంజుతుండ్రు..?

by Disha Web Desk 4 |
ధరణి ఆపరేటర్ల దందా.. కొర్రీలు పెట్టి పైసలు గుంజుతుండ్రు..?
X

ధరణి పోర్టల్‌లోని లొసుగులు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖలో భూప్రక్షాళన, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఆయా మండల కేంద్రాల్లో తహశీల్దార్లకు సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించింది. దీంతో పాటు ప్రతి కార్యాలయంలో ధరణి పోర్టల్‌లో నైపుణ్యం కలిగిన ఒక ఆపరేటర్‌ను సైతం నియమించింది. భూముల క్రయవిక్రయాల సమయంలో, భూముల రికార్డుల మార్పులు, చేర్పులకు రైతులకు సులభ తరంగా మారింది.

అయితే ధరణి పోర్టల్ ఏర్పాటు సమయంలో ఆయా మండలాల్లోని వ్యవసాయ భూముల రికార్డుల డేటా ఎంట్రీ సమయంలో చాలా వరకు తప్పులు దొర్లాయి. దీంతో చాలామంది రైతులు, భూములు కలిగిన వారు తహశీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని మండల కార్యాలయాల్లో ధరణి ఆపరేటర్లు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ధరణి పోర్టల్‌లో లోపాలు సరి చేయమని, తమ వద్దకు వచ్చే రైతుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. - దిశ, కోరుట్ల

దిశ, కోరుట్ల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో భూ ప్రక్షాళన, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత ఉండేలా ధరణి పోర్టల్ ప్రవేశపెట్టింది. ధరణి పోర్టల్ ఏర్పాటు చేయడం, ఆయా మండల కేంద్రాల్లో తహశీల్దార్లకు సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించడంతో పాటు ధరణి పోర్టల్‌లో నైపుణ్యం కలిగిన ఒక ఆపరేటర్‌ను సైతం నియమించింది. ధరణి పోర్టల్ ప్రవేశ పెట్టినప్పటి నుంచి భూముల క్రయవిక్రయాల సమయంలో భూముల రికార్డుల మార్పులు, చేర్పులకు రైతులకు సులభ తరంగా మారింది.

కానీ, ధరణి పోర్టల్ ఏర్పాటు సమయంలో ఆయా మండలాల్లోని వ్యవసాయ భూముల రికార్డుల డేటా ఎంట్రీ సమయంలో చాలా వరకు తప్పులు దొర్లాయి. దీంతో చాలామంది రైతులు, భూములు కలిగిన వారు తహశీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి తిరిగి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని మండల కేంద్రాల్లో పని చేస్తున్న ధరణి పోర్టల్ ఆపరేటర్లు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ధరణి పోర్టల్‌లో లోపాలు సరి చేయమని, తమ వద్దకు వచ్చే రైతుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న ఘటనలు చాలా ఉన్నాయి. ధరణి పోర్టల్ ఏర్పాటు సమయంలో దొర్లిన తప్పిదాలు కొందరు ఆపరేటర్లకు కనక వర్షం కురిపిస్తోంది.

మీ సేవా కేంద్రంగా తహశీల్దార్ కార్యాలయం...

ధరణిలో సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు ఏదైనా మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అలా దరఖాస్తు చేసుకున్న రైతులకు సహకరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో ఉన్న ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన మాడ్యూల్ టీఎం 15నుంచి మొదలుపెడితే టీఎం 31వరకు ఉన్న సమస్యలు ధరణి పోర్టల్‌లో మేమే అప్లై చేస్తామని చెప్తున్నారు.

లోపాలు ఎలా సరి చేయాలో తమకే తెలుసని, మీరు ఇతరుల వద్ద అప్లై చేస్తే మీ సమస్య పరిష్కారం కాదని కొందరు ఆపరేటర్లు వారి సొంత లాగిన్‌ ద్వారా నేరుగా అప్లై చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా అప్లై చేస్తూ మీ సేవ కేంద్రాల్లో చేయాల్సిన పనులను సొంతంగా నిర్వహిస్తూ తహశీల్ధార్ కార్యాలయాలను మీ సేవ కేంద్రాలుగా మార్చారని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రతి పనికో రేటు...

ధరణి పోర్టల్‌లో ఎటువంటి సమస్య అయినా తమను కలిస్తే ఇట్టే జరుగుతుందని చెబుతున్నట్లు పలువురు వాపోతున్నారు. తహశీల్దార్ కంటే ముందు తమనే కలవాలని హుకూం జారీ చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. కాగా, కార్యాలయంలో ప్రతి పనికో రేటు పెట్టి రైతుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేయడం ధరణి ఆపరేటర్లకు అలవాటైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు ఈ విషయంలో దృష్టి సారించి అక్రమ వసూళ్లను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.



Next Story