- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోగి రాగానే అడ్మిషన్ మస్ట్.. తిప్పి పంపితే కుదరదు
తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరులో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పేద రోగుల పాలిట శాపంగా మారిన ‘రిఫరల్’ విధానానికి చెక్ పెడుతూ, బాధ్యతాయుతమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పకడ్బందీ ప్రణాళికను రచిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరులో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పేద రోగుల పాలిట శాపంగా మారిన ‘రిఫరల్’ విధానానికి చెక్ పెడుతూ, బాధ్యతాయుతమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పకడ్బందీ ప్రణాళికను రచిస్తోంది. ఇకపై ప్రభుత్వ దవాఖానకు వచ్చిన ఏ రోగినీ.. ‘మా వల్ల కాదు’, ‘ఇక్కడ సౌకర్యాలు లేవు’, ‘కేసు సీరియస్‌గా ఉంది’ అనే సాకులు చెప్పి తిప్పి పంపేందుకు వీల్లేదు. రోగి పరిస్థితి ఏదైనా సరే.. ఆసుపత్రి గడప తొక్కిన వెంటనే అడ్మిషన్ చేసుకోవాల్సిందే. ఒకవేళ మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి పంపాల్సి వచ్చినా.. చేతులు దులుపుకునే వ్యవహారానికి తావు లేకుండా కఠిన నిబంధనలతో కూడిన ‘రిఫరల్ సిస్టమ్’ను అమల్లోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది.
అడ్మిషన్ తర్వాతే ఏదైనా..
ప్రస్తుతం అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగి పరిస్థితి విషమంగా ఉందనో, వెంటిలేటర్లు ఖాళీ లేవనో చెప్పి అడ్మిషన్ చేసుకోకుండానే వెనక్కి పంపుతున్న ఘటనలు కోకొల్లలు. దీనివల్ల సమయానికి వైద్యం అందక ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ దుస్థితిని మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇకపై రోగి ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా ముందుగా అడ్మిషన్ నమోదు చేసుకోవడం తప్పనిసరి చేయనున్నారు. ప్రాథమిక చికిత్స అందించి, రోగిని స్థిరీకరించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సంబంధిత ఆసుపత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోయినా, ఎక్విప్‌మెంట్ అందుబాటులో లేకపోయినా రోగిని పెద్ద ఆసుపత్రికి (టెర్షరీ కేర్) రిఫర్ చేయవచ్చు. కేవలం మౌఖికంగా చెప్పి పంపడం కుదరదు. పేషెంట్‌ను ఎందుకు రిఫర్ చేస్తున్నారో రికార్డుల్లో స్పష్టమైన కారణం రాయాలి. ఏ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారో, అక్కడ ఆ సౌకర్యం ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా రిఫర్ చేసే ముందే సంబంధిత పెద్ద ఆసుపత్రికి సమాచారం ఇవ్వాలి. దీనివల్ల రోగి అక్కడికి వెళ్లగానే బెడ్, వైద్యులు సిద్ధంగా ఉండే వెసులుబాటు కలుగుతుంది.
అధ్యయనానికి కమిటీ...
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం ఉన్నతాధికారులతో ఈ అంశంపై అంతర్గతంగా సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. ప్రభుత్వాసుపత్రుల్లో రిఫరల్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, ఇతర రాష్ట్రాల్లోని విధానాలను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే పేద రోగులకు అగచాట్లు తప్పి, సకాలంలో మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా రిఫరల్‌కు ‘పక్కా’ నిబంధనలు అమలై కిందిస్థాయి హాస్పిటల్స్ వైద్యుల ఇష్టారాజ్యానికి చెక్ పడనుంది.






