మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. భారీ భద్రత, ట్రాఫిక్ మళ్లీంపు.. ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష

by Ramesh Naini |

మెస్సీకి ఉన్న ప్రపంచవ్యాప్త ఇమేజ్ దృష్ట్యా, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నందున భద్రతాపరమైన ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలని డీజీపీ శివధర్ రెడ్డి అధికారులకు సూచించారు.

మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. భారీ భద్రత, ట్రాఫిక్ మళ్లీంపు.. ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: దిగ్గజ క్రీడాకారుడు లియోనల్ మెస్సీకి ఉన్న ప్రపంచవ్యాప్త ఇమేజ్ దృష్ట్యా, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నందున భద్రతాపరమైన ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలని డీజీపీ శివధర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 13న మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతాపరమైన, ఇతర ఏర్పాట్లపై డీజీపీ గురువారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), విద్యుత్ శాఖ, వాటర్ వర్క్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు చెందిన అధికారులతో పాటు మ్యాచ్ నిర్వాహకులు కూడా ఈ సమావేశంలో హాజరై, తమ శాఖల ద్వారా జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీకి వివరించారు.

మ్యాచ్‌కు తరలివచ్చే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లలోనూ, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసే ప్రచార బోర్డుల ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ట్రాఫిక్ మళ్లింపు వివరాలను తెలియజేయాలని డీజీపీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మ్యాచ్‌ను ఎటువంటి లోపాలు లేకుండా, విజయవంతంగా నిర్వహించాలని డీజీపీ తెలిపారు.

సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, డీజీ ఎస్పీఎఫ్ స్వాతి లక్రా, అడిషనల్ డీజీపీ సీఐడీ చారు సిన్హా, అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ విజయకుమార్, డిజీ, ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ పద్మజ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె. శివసేన రెడ్డి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

Next Story