మహిళలపై పెరిగిన దాడులు.. 509 మంది మావోయిస్టులు లొంగుబాటు.. రాష్ట్ర పోలీస్ శాఖ వార్షిక వివరాలు ఇవే

by Ramesh Naini |

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాలు కూడా పూర్తిగా అదుపులో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

మహిళలపై పెరిగిన దాడులు.. 509 మంది మావోయిస్టులు లొంగుబాటు.. రాష్ట్ర పోలీస్ శాఖ వార్షిక వివరాలు ఇవే
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాలు కూడా పూర్తిగా అదుపులో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఈ ఏడాది నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని తెలిపారు. తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక-2025 ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, గత ఏడాది 2,34,158 కేసులు నమోదు అయితే 2025 లో 2,28,695 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. బీఎన్ఎస్ కేసులు 2024లో 1,69,477 కేసులు నమోదు కాగా 2025 లో 1,67,018 నమోదు అయ్యాయని ఇవి గతేడాదితో పోలిస్తే 1.45 శాతం తగ్గాయని తెలిపారు. నేర నిరూపణ శాతం 3.09 శాతం పెరిగిందని, ఇది గత ఏడాది 35.63 శాతం ఉంటే ఈ ఏడాది 38.72 శాతం ఉందని పేర్కొన్నారు. వీటిలో నాలుగు కేసుల్లో మరణశిక్ష పడిందని, 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ శిక్ష పడిందని చెప్పారు. మొత్తం 141 పోక్సో కేసుల్లో ఈ ఏడాది 154 మంది నిందితులకు జీవిత ఖైదు విధించబడిందని, 3 కేసుల్లో నిందితులకు మరణ శిక్ష పడిందని తెలిపారు.

28 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 53 మంది నిందితులకు జీవిత ఖైదు పడిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా హత్యలు 8.76 శాతం తగ్గాయని, లైంగిక దాడులు 13.45 శాతం, దోపిడీలు 27 శాతం, దొంగతనాలు 9.1 శాతం తగ్గాయని తెలిపారు. నమ్మక ద్రోహం కేసులు 23 శాతం పెరిగాయని వెల్లడించారు. పోలీస్ స్టేషన్లలో ఫీడ్‌బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్‌ల సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈ ఏడాది వచ్చిన వరదల సమయంలో సమర్థవంతంగా పని చేసి ప్రాణనష్టం లేకుండా చూశారన్నారు. మరోవైపు డ్యూటీ మీట్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్ లో తెలంగాణ పోలీసులు తమ సత్తా చాటారని డీజీపీ గుర్తు చేశారు. జార్ఖండ్‌లో నిర్వహించిన 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో 18 పతకాలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారని చెప్పారు. ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్స్‌లోనూ 10 పతకాలతో సత్తా చాటారని పేర్కొన్నారు.

3 శాతం పెరిగిన మహిళలపై దాడులు

మహిళలపై దాడులు 3 శాతం పెరిగాయి. అత్యాచార కేసులు 13 శాతం, కిడ్నాప్ కేసులు 10 శాతం వేధింపుల కేసులు 9 శాతం తగ్గాయి. 2024 లొ 19,922 కేసులు నమోదవగా 2025 లో 20,551 కేసులు నమోదయ్యాయి. వరకట్నం కోసం మహిళల హత్యలు 2 శాతం తగ్గాయని, వారి భద్రత కోసం షీటీం లు యాక్టివ్‌గా పని చేస్తున్నాయన్నారు. డ్రగ్స్ కేసుల్లో 30-31 శాతం పెరుగుదల కనిపించింది. 'ఈగిల్' టీం సుమారు ₹173 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 5.68 శాతం పెరిగింది, మరణాల సంఖ్య మాత్రం సుమారు 8 శాతం వరకు తగ్గింది. ఏఎఫ్ఐఎస్ యూసేజ్‌తో 7,812అనుమానితులను గుర్తించినట్లు తెలిపారు.

509 మంది మావోయిస్టుల లొంగుబాటు..

ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో 23 మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారని డీజీపీ వెల్లడించారు. వారిలో ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్స్ 11 మంది స్టేట్ కమిటీ మెంబర్లు , ముగ్గురు డివిజన్ కమిటీ సెక్రటరీలు, 17మంది డీవీసీఎంలు/ సీవై పీసీఎంలు, 57 ఏసీఎం/ పీపీసీఎం మెంబర్లు ఉన్నట్లు తెలిపారు. లోంగిపోయిన 509మందిలో 483మంది చత్తీశ్‌ఘడ్‌కు చెందిన వారే ఉన్నారన్నారు.

సైబర్ క్రైమ్ కేసుల్లో 23 శాతం రికవరీ..

ఈ ఏడాది సైబర్ క్రైమ్ కేసుల్లో రికవరీ 23 శాతం పెరిగిందని, రూ. 246 కోట్లు రికవరీ చేశామని డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. 24, 498 మంది బాధితులకు రూ.159.65 కోట్లు రిఫండ్ చేశామన్నారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదుల్లో 3 శాతం తగ్గిందని దేశ వ్యాప్తంగా 41 శాతం పెరిగిందని తెలిపారు. సైబర్ క్రైమ్ ఫైనాన్షియల్ లాస్ 21 శాతం తగ్గినట్లు వెల్లడించారు. 2024లో 1753 కోట్లు ఉండగా 2025 లో 1378.34కోట్లు ఉన్నట్లు తెలిపారు. సెల్ ఫోన్ల రికవరీ విషయంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని, రోజుకు సగటున 111 ఫోన్లు రికవరీ అవుతున్నాయని వెల్లడించారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా లక్ష ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు.

2025 లో చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు..

*మే 11 నుంచి 31వ తేదీ వరకు మిస్ వరల్డ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు భద్రత చేసిన భద్రత ఏర్పాట్లు .

*జూలై 28,29 తేదిలలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వందకు పైగా కేసులను విచారించారు. రాష్ట్ర పోలీస్ శాఖ అవలంభిస్తున్న విధానాలను ప్రశంసించారు.

* డిసెంబర్ 8,9 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి భారీ భద్రత.

* డిసెంబర్ 13వ తేదిన రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ స్టేడియం ఉప్పల్‌లో జరిగిన ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ జీవోఏటీ కార్యక్రమానికి భారీ భద్రత

* జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా 7,22,487కేసుల పరిష్కారం.

*ఆగస్టు 20నుంచి 22వ తేదిలలో ఆర్‌బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో వుమెన్ ఇన్ పోలీస్ తొలి కాన్ఫరెన్స్ నిర్వహణ.

Next Story