- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మిగిలిన 15 మంది క్యాడర్ మావోయిస్ట్‌లు! లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు
రాష్ట్రానికి చెందిన మిగిలిన 15 మంది క్యాడర్‌లు సహా అన్ని స్థాయిల మావోయిస్టులు ముందుకు వచ్చి ప్రభుత్వ సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ కింద లొంగిపోవాలని డీజీపీ కోరారు.

దిశ తెలంగాణ బ్యూరో: అజ్ఞాతంలో కొనసాగుతున్న సీపీఐ (మావోయిస్టు) నాయకులు, కార్యకర్తలు సమాజంలోని ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చి శాంతియుత, గౌరవప్రదమైన జీవితం గడపాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. రాష్ట్రానికి చెందిన మిగిలిన 15 మంది క్యాడర్‌లు సహా అన్ని స్థాయిల మావోయిస్టులు ముందుకు వచ్చి ప్రభుత్వ సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ కింద లొంగిపోవాలని కోరారు. గత రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ పోలీసులు నిరంతర ప్రయత్నాల ఫలితంగా వివిధ స్థాయిలలోని 588 మంది మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు సాధారణ జీవితంలోకి తిరిగి చేరినట్లు డీజీపీ వెల్లడించారు. వీరందరూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ విధానం కింద ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు, భద్రతా హామీలు వంటి ప్రయోజనాలను పొందినట్లు తెలిపారు.
పునరావాస ప్యాకేజీలకు ప్రభుత్వం సిద్దం..
ప్రస్తుతం వారు తమ కుటుంబాలతో కలిసి స్వగ్రామాల్లో సురక్షితంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానం తో ఇతర రాష్ట్రాలకు చెందిన అజ్ఞాత మావోయిస్టులు కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు. మారుతున్న కాలంలో హింసకు స్థానం లేదని, శాంతియుత, నిర్మాణాత్మక పరిష్కారాల ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని డీజీపీ స్పష్టం చేశారు. మావోయిస్టు నాయకులు తమ కుటుంబాలతో తిరిగి కలిసి, రాష్ట్ర అభివృద్ధి, పురోగతికి సానుకూలంగా దోహదపడాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన స్రవంతిలోకి రావాలనుకునే వారికి తక్షణ సహాయం, భద్రతా చర్యలు, పునరావాస ప్యాకేజీలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డీజీపీ తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో స్వేచ్ఛగా, గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు.






