‘సురక్ష’ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన డీజీపీ

by Ajay Maddhiboyina |

తెలంగాణ పోలీస్‌ శాఖ అధికారిక గొంతుకగా, సిబ్బందికి సమాచార వారధిగా సేవలందిస్తున్న ‘సురక్ష’ ఆన్‌లైన్‌ డైలీ సరికొత్త మైలురాయిని అధిగమించిందని డీజీపీ బి.శివధర్‌ రెడ్డి తెలిపారు.

‘సురక్ష’ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన డీజీపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పోలీస్‌ శాఖ అధికారిక గొంతుకగా, సిబ్బందికి సమాచార వారధిగా సేవలందిస్తున్న ‘సురక్ష’ ఆన్‌లైన్‌ డైలీ సరికొత్త మైలురాయిని అధిగమించిందని డీజీపీ బి.శివధర్‌ రెడ్డి తెలిపారు. దశాబ్దాల అనుభవం ఉన్న రిటైర్డ్ పోలీస్ అధికారుల , సిబ్బంది సలహాలను ప్రచురించడం ద్వారా, విధుల్లోకి కొత్తగా వస్తున్న యువ పోలీసులకు ఇది ఒక దిక్సూచిలా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం డీజీపీ కార్యాలయంలో శతదినోత్సవ వేడుకల కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ వంద రోజుల ప్రయాణంలో కృషి చేసిన సురక్ష ఎడిటర్ సైబరబాబాద్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ‘సురక్ష’ ప్రత్యేక సంచికను డీజీపీ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ‘సురక్ష’ పత్రిక చీఫ్‌ ఎడిటర్‌ గా ఉన్న డీజీపీ బి.శివధర్‌ రెడ్డి మాట్లాడుతూ తాను స్వయంగా ప్రారంభించిన సురక్ష ఆన్‌లైన్‌ డైలీ, వంద రోజుల వేడుకలోనూ పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో మాసపత్రికగా ఉన్న సురక్ష వృత్తిపరమైన మెళకువలను అందించేదనీ , ఇప్పుడు డిజిటల్‌ రూపంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో ఉన్న సిబ్బందికి చెరువవుతుందన్నారు. సురక్ష పత్రిక మాత్రమే కాదు, మన శాఖ సమాచార వారధి అని, సమాచార మార్పిడిలో దీన్ని మరింత పటిష్టం చేయాల్సి ఉందని తెలిపారు.

సీపీ డాక్టర్‌ ఎం.రమేష్‌ మాట్లాడుతూ పత్రిక భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. శాఖలో అహర్నిశలు శ్రమిస్తున్న సిబ్బంది సేవలను గుర్తించడం, వారి మధ్య సమన్వయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ డైలీని తెచ్చామని , గత కొన్ని సంవత్సరాల నాటి సంకల్పం నేడు వంద రోజుల ప్రయాణానికి దోహద పడిందన్నారు. త్వరలోనే ‘సురక్ష’ను సాధారణ దినపత్రికల తరహాలో అన్ని హంగులతో పూర్తిస్థాయి పత్రికగా తీర్చిదిద్దాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ‘సురక్ష’ను ప్రతి రోజు పాఠకుల ముందుకు తీసుకురావడంలో కృషి చేసిన నాంపల్లి శ్రీనివాస్‌ను డీజీపీ సన్మానించారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ యూనిట్లలో పనిచేస్తున్న పిఆర్‌ఓలకు రివార్డులను అందజేశారు.

Next Story