అసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇకనుంచి చూపిస్తాం : డీజీపీ సీవీ ఆనంద్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-15 16:35:05  IST  )

రాష్ట్రంలో ఇకపై అసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

అసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇకనుంచి చూపిస్తాం : డీజీపీ సీవీ ఆనంద్
X
  • కార్లలో వెనుక కూర్చున్నా సీట్ బెల్ట్ తప్పనిసరి
  • క్యాంపస్‌లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలదే బాధ్యత
  • డబ్బు వ్యామోహం ఉంటే పోలీస్ శాఖకు రావొద్దు
  • పాన్ షాపు పెట్టుకోండి.. డీజీపీ సీవీ ఆనంద్

దిశ, తెలంగాణ బ్యూరో: సమాజంలో 5 శాతం ఉన్న నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే 95 శాతం సామాన్యుల పట్ల అత్యంత మర్యాదగా ప్రవర్తించడమే అసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఇకపై తెలంగాణలో ఇదే తరహాలో ఎఫెక్టివ్ పోలీసింగ్ అమలు చేస్తామని ఆయన తేల్చిచెప్పారు. కాలానుగుణంగా వస్తున్న సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాల వంటి సరికొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా రాష్ట్ర పోలీస్ శాఖను సమూలంగా సమాయత్తం చేస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమం లో పాల్గొన్న డీజీపీ పలు కీలక అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

క్యాంపస్‌లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలదే బాధ్యత..

రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు పోలీసు శాఖ పనిచేస్తోందని డీజీపీ తెలిపారు. విద్యాసంస్థల్లో దీని విస్తరణ తీవ్ర కలవరపెడుతోందని, దీన్ని అడ్డుకునేందుకు ప్రతి స్కూల్, కాలేజీ, వర్సిటీల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటును ప్రభుత్వం తప్పనిసరి చేయబోతోందని ప్రకటించారు. దీనిపై ముఖ్యమంత్రి స్థాయులో ఇప్పటికే చర్చలు జరిగాయని, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రానున్నాయని వెల్లడించారు. అడ్మిషన్ల సమయంలోనే తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అండర్ టేకింగ్ తీసుకోవాలని, క్యాంపస్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే ఇకపై యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అవుతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. విద్యాసంస్థల సమీపంలోని పాన్ షాపులపై నిరంతర నిఘా కొనసాగుతోందన్నారు.

ప్రాణాలు తీస్తున్న రోడ్డు ప్రమాదాలు..

రోడ్డు ప్రమాదాలతో రాష్ట్రంలో ఏటా 7,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోతుండటం అత్యంత బాధాకరమన్నారు. మరణాలను తగ్గించడానికి, రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయడానికి సీఎం ఆదేశాలతో త్వరలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రోడ్ల డిజైన్లలో లోపాలను సరిదిద్దడం, బ్లాక్ స్పాట్ల గుర్తింపుపై ఈ బ్యూరో పనిచేస్తుందన్నారు. ట్రాఫిక్ ఫ్లో పెంచేందుకు ఏర్పాటు చేసిన యూ టర్న్‌లపై వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి, అవసరమైన చోట పునఃసమీక్షిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు కార్లలో ముందు సీటు వారే కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి అని ఆయన సూచించారు.

డబ్బుల కోసమైతే రావొద్దు..

పోలీసు శాఖలోకి కొత్తగా వచ్చే యువతకు డీజీపీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రజలకు సేవ చేయాలన్న తపన, నిబద్ధత ఉన్నవారే ఈ శాఖలోకి రావాలని.. అధికారం చెలాయించడానికో, డబ్బు సంపాదించడానికో వస్తే ఏదో ఒక రోజు ఏసీబీ ట్రాప్‌లో పడటం, సస్పెండ్ కావడం ఖాయమన్నారు. కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు పోలీసు శాఖలో చేరడం కంటే.. ఓ పాన్ షాపు పెట్టుకుంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. దయచేసి డిపార్ట్‌మెంట్‌కు వచ్చి ప్రభుత్వానికి, శాఖకు చెడ్డపేరు తేవద్దు అని ఆయన ఘాటుగా హితవు పలికారు.

పోలీసుల ఆరోగ్యం కోసం ఫిట్ కాప్ యాప్..

రోజుకు 16 గంటలు శ్రమిస్తున్న సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమం తనకు అత్యంత ప్రాధాన్యత అని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. గతంలో తాను హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఫిట్ కాప్ కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో ఉన్న 75 వేల మంది సిబ్బందికి ఒక ప్రత్యేక యాప్ ద్వారా అమలు చేసి వారి ఆరోగ్యాన్ని మానిటర్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తన ఫిట్‌నెస్ రహస్యాన్ని పంచుకుంటూ.. అన్నం,పంచదార, ఉప్పు, మైదా తాను దూరమని తెలిపారు. వారానికి మూడు రోజులు వెయిట్ ట్రైనింగ్, టెన్నిస్, గోల్ఫ్ ఆడుతానని చెప్పారు.

కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు.. అందరికీ నేనున్నా..

చట్ట ప్రకారం నిజాయితీగా విధులు నిర్వర్తించే ప్రతి కానిస్టేబుల్, హోంగార్డుకు తాను సంపూర్ణ అండగా నిలబడతానని డీజీపీ భరోసా ఇచ్చారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పెద్ద పెద్ద వీఐపీలు బెదిరించినా, విధులు నిర్వర్తించిన సిబ్బందికి తాను రక్షణగా నిలిచానని, ఒక్కరిని కూడా సస్పెండ్ కానివ్వలేదని గుర్తుచేశారు. మహిళా అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని, గతంలో తన హయాంలో 18 మంది డీసీపీలలో 9 మంది మహిళలకే అవకాశం ఇచ్చానని ఆయన వివరించారు. ప్రస్తుత యువ అధికారుల ఆలోచనా విధానాలు భిన్నంగా ఉన్నాయని, సీనియర్లు ఆ మార్పును అర్థం చేసుకుని వారిని సరైన మార్గంలో గైడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story