- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేవెళ్ల విషాదానికి కారణమైన టిప్పర్‌పై చలాన్ల వివరాలు వెలుగులోకి..
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: (Chevella bus accident) రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ వాహనంపై పలు ఉల్లంఘనలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. వాహనం నంబర్ TG06T3879కు సంబంధించిన వివరాల ప్రకారం.. వాహన యజమాని ఉదిత్య అనిత పేరుతో రిజిస్టర్ అయింది. ఈ వాహనంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రెండు చలాన్లు విధించారు. అక్రమంగా నిషేధిత సమయాల్లో భారీ లోడ్‌తో నగరంలోకి ఎంట్రీ ఇచ్చిందని, ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్ నెలల్లో చందానగర్, ఆర్సీ పురం పరిధిలో హైదరాబాద్ పోలీసులు ఫైన్ వేశారు. మొత్తం రెండు చలాన్లతో కలిపి రూ.3,270 జరిమానా విధించారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఈ టిప్పర్ మోతాదుకు మించిన కంకర లోడ్‌తో పాటు అధిక వేగంతో ప్రయాణించినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ కారణంగానే బస్సు, లారీ మధ్య ఢీకొనడం జరిగి, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన టిప్పర్ డ్రైవర్ ఆకాశ్‌గా గుర్తించారు. అతను మహారాష్ట్ర వాసి కాగా.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లచ్చానాయక్ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ టిప్పర్ వాహనం.. పటాన్‌చెరు క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర తీసుకెళ్తుండగా ఓవర్ స్పీడ్ కారణంగా అదుపుతప్పి బస్సును ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు.
కాగా, మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లు, ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి, పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. 19 మంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయి ఇప్పటికే కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇక, ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది.






