ఆర్టీసీలో ప్రయాణం.. ఇకపై టికెట్‌ లేకుండానే!.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆర్టీసీలో ప్రయాణం.. ఇకపై టికెట్‌ లేకుండానే!.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ప్రజా భవన్‌లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా ప్రయాణికుల ఉచిత బస్సు ప్రయాణాలకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ఈ కార్డులు తెలంగాణలోని ప్రతి మహిళకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ బలోపేతం, కార్మికుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కీలకమైన చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళా సాధికారత దిశగా రాష్ట్రం ముందడుగు వేస్తోందన్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 255 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదు అయినట్లు చెప్పారు.

ప్రజా ప్రభుత్వ ఆవిర్భావం తర్వాత ఆర్టీసీ పీఎఫ్ బకాయిలను రూ.1400 కోట్ల నుంచి రూ.660 కోట్లకు, సీసీఎస్ బకాయిలను రూ.600 కోట్ల నుంచి రూ.373 కోట్లకు తగ్గించామని తెలిపారు. పీఎం ఈ-డ్రైవ్ కింద హైదరాబాద్‌లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు, నిజామాబాద్-వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. వీటికి అవసరమైన చార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యా సంవత్సర ప్రారంభానికి ముందే విద్యార్థులకు యూనిఫామ్‌లు, పుస్తకాలు, షూస్ పంపిణీ చేసే విధంగా సమన్వయం చేయాలని ఆర్థిక శాఖకు దిశానిర్దేశం ఇచ్చారు. నాయి బ్రాహ్మణ, రజక కుల వృత్తుల సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ బిల్లులను క్రమం తప్పకుండా విడుదల చేయాలని ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్న ఉప ముఖ్యమంత్రి, 100 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసి కార్పొరేట్ తరహా భవనాల నిర్మాణం ప్రారంభించిందన్నారు. గురుకులాల మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీల కోసం రూ.152 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story