డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి 45 స‌మ‌స్యలు.. సానుకూల నిర్ణయం తీసుకుంటామ‌ని హామీ

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.

డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి 45 స‌మ‌స్యలు.. సానుకూల నిర్ణయం తీసుకుంటామ‌ని హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. శుక్రవారం ప్రజాభవన్‌లో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు వారధి ఉద్యోగులేనని, ఉద్యోగుల సేవలను కొనియాడారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక క్రమశిక్షణతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంపై సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు అందుతున్నాయని, దీనివల్ల వేలాది కుటుంబాలకు ఊరట లభిస్తోందని వారు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ చెల్లించేందుకు ప్రభుత్వం ప్రతి నెలా రూ. 1,000 కోట్లు కేటాయించడాన్ని వారు హ‌ర్షం వ్యక్తం చేశారు. భేటీ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా పీఆర్సీ, కరువు భత్యం, హెల్త్ కార్డ్స్ వంటి సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన భట్టి.. ఈ అంశాలన్నింటినీ కేబినెట్ సబ్ కమిటీలో సమగ్రంగా చర్చించి త్వరలోనే ఉద్యోగులకు చెబుతామని హామీ ఇచ్చారు. మీరు చెప్పిన కోర్కెలను సీఎం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. మీ సమస్యలు ఇతర అంశాలపై క్యాబినెట్ సబ్ కమిటీలు చర్చించనున్నట్లు తెలిపారు.

సానుకూల నిర్ణయం తీసుకుంటామ‌ని హామీ..

త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామ‌ని భ‌ట్టి చెప్పారు. ఉద్యోగుల స‌మ‌స్యల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా త్వర‌లోనే సీఎంతో ప్రత్యేకంగా స‌మావేశ‌మై తీపి క‌బురు చెప్తాన‌ని డిప్యూటీ సీఎం భట్టి తెల‌ప‌డం ప‌ట్ల టీజీఈ జేఏసీ చైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. సానుకూల నిర్ణయం తీసుకుంటార‌ని ఆశిస్తున్నామ‌ని తెలిపారు. ఐతే ఉద్యోగుల స‌మ‌స్యల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా మే 5వ తేదీన చేప‌ట్టనున్న కార్యచ‌ర‌ణ‌పై టీజీఈ జేఏసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులంద‌రితో చ‌ర్చించిన త‌ర్వాతే నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. ల‌చ్చిరెడ్డి ఆధ్వర్యంలో టీజీఈ జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం దృష్టికి 45 స‌మ‌స్యలు తీసుకెళ్లారు. ప్రధానంగా పీఆర్సీ, పెన్షనర్లు, ఉద్యోగుల పెండింగు బిల్లుల వంటివి ఉన్నాయి. భట్టితో బేటీ అయిన వారిలో టీజీఈ జేఏసీ భాగ‌స్వామ్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కె.రామకృష్ణ, ఎస్‌.రాములు, బాణాల రాం రెడ్డి, పెంట‌య్య, రామేష్ పాక‌, డా.నిర్మల‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story